పరువుపోతుందనే సాహసం చేశారట

తెలంగాణలోని పవర్‌ఫుల్ లీడర్లలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఒకరు. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే ఆయన మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్‌‌ను అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే, తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్‌ను ఈసారి అసెంబ్లీలోనే అడుగు పెట్టనివ్వవద్దన్న పట్టుదలతో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌.. అందుకోసం పలు వ్యూహాలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తమ్ముడు నరేందర్‌రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. అన్నిరకాల అండదండలు అందిస్తోంది. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు మంత్రులు, ఎంపీలు నరేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే ఈ నెల 4 కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభను అడ్డుకోవాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేసీఆర్‌ సభను బహిష్కరించాలంటూ కోడంగల్‌ బంద్‌కు పిలువునిచ్చిన నేపథ్యంలో 3న అర్ధరాత్రి రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అయింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం కోస్గిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. దానికి ముందు రెండు మూడు రోజుల కిందట పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేశారు. దానిపై శనివారం అర్ధరాత్రి సమయంలో రేవంత్‌ రోడ్డుపై ధర్నా చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని, సీఎం కేసీఆర్‌ను అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి అరుణకుమారి రేవంత్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొడంగల్‌లోని రేవంత్‌రెడ్డి నివాసాన్ని సుమారు 100 మంది పోలీసులు ఆయన మోహరించారు. మరో 50 మంది వరకూ పోలీసులు గేటుపై నుంచి దూకి ఇంట్లోకి వెళ్లారు. నేరుగా ఆయన బెడ్‌రూం వద్దకు వెళ్లారు. తలుపు కొట్టి ఆయనను నిద్ర లేపలేదు. ఆ చీకట్లో ఐదు నిమిషాల్లోనే రేవంత్‌ రెడ్డి బెడ్‌రూం తలుపులు బద్దలు కొట్టి నేరుగా లోనికి ప్రవేశించి, ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసుల హైడ్రామా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం స్వయంగా హైకోర్టుకు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయాలంటూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి ఒక తెల్ల కాగితంపై ఎలాంటి తేదీలు, సీల్‌ లేకుండా సిఫార్సు చేయడం, దాన్ని జిల్లా ఎస్పీ కూడా అంతే నిర్లక్ష్యంగా ఆమోదించి అరెస్టుకు ఆదేశించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే వికారాబాద్ ఎస్పీపై బదిలీవేటు కూడా వేశారు. ఈ రచ్చ అంతటికీ కారణం టీఆర్ఎస్ ముఖ్య నేతలేనని తెలుస్తోంది. రేవంత్.. కేసీఆర్ సభను అడ్డుకుంటే తమ పరువు పోతుందని ఆ పార్టీ అధిష్ఠానం భావించిందట. అందుకే సాహసమే అయినా.. రేవంత్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా డీజీపీని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీని వల్ల అటు టీఆర్ఎస్‌కు, ఇటు తెలంగాణ పోలీసులకు చెడ్డపేరు వచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.