కాలంచెల్లిన సర్పంచ్ లే టీడీపీకి కంచుకోట?

సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలో అత్యధిక శాతం సర్పంచ్‌లు టీడీపీ మద్దతుదారులే ఉండటంతో వారిని పర్సన్ ఇన్‌ఛార్జిలుగా కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో పార్టీకి మరింత మేలు కలుగుతుందన్న ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. దీంతో పంచాయతీ పాలన కోసం పర్సన్ ఇన్‌ఛార్జిలను లేదా ప్రత్యేక అధికారులకు ఆ బాధ్యతలను కట్టబెట్టాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 143(3) ప్రకారం సర్పంచ్‌ల పదవీకాలం ముగిశాక, పంచాయతీ పాలనపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే తెలంగాణాలో మాత్రం సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. ఏపీలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పర్సన్ ఇన్‌ఛార్జిల పదవులను సర్పంచ్‌లకు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో సర్పంచ్‌లు రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా తమదే హవా ఉంటుందని అనుకుంటున్నారని భోగట్టా. మరోపక్క పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలా? లేదా వాయిదా వేయాలన్న అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో ముందడుగు వేయలేకపోతొంది. పంచాయతీ ఎన్నికలను నిర్ధేశించిన కాలంలో నిర్వహించలేని పక్షంలో అందుకు గల కారణాలను ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించాల్సి వస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 12వేల పంచాయతీలలో 7వేలకు పైగా సర్పంచ్‌లు టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. దీంతో ఆ సర్పంచ్‌లను కొనసాగించడమే మేలన్న ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉంది. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో  మొత్తం 921 పంచాయతీలు ఉండగా వాటిలో 576 పైచిలుకు పంచాయతీలు టీడీపీ మద్దతుదారులే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పర్సన్ ఇన్‌ఛార్జిల పాలనకే టీడీపి ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.