కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఏపీలో ఎన్ని పార్టీలు ఉన్నా టీడీపీ-వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావించారంతా. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ కూడా రేసులోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఆ పార్టీ జాతీయ నేతలు గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలను తిరిగి రప్పించేందుకు పావులు కదిపారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కిరణ్ చేరిక వెనుక పల్లంరాజు, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

మిగతా కాంగ్రెస్ నాయకుల సంగతేమిటో గానీ, కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చినట్లుయింది. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న నేత కావడంతో ఇప్పుడు కిరణ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఆయన మాత్రం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానే తప్ప, పార్టీ భారాన్ని మొత్తం తలకెత్తుకోనని చెబుతున్నారు. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలోకి రావాలని ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. అయితే, అనివార్య కారణాల వల్ల ఆయన కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే… కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయడం కంటే పార్లమెంట్‌కే వెళ్లాలని ఆసక్తి చూపించారట. అందుకే ఆయనకు కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచినా.. కాంగ్రెస్ అధికారంలోకి రాదని, అందుకే ఆయన పార్లమెంట్‌కు పోటీ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. గత ఎన్నికలో ఇక్కడ జరిగిన ఎన్నికలో టీడీపీ-బీజేపీ అభ్యర్ధి పురందేశ్వరిపై వైసీపీ అభ్యర్ధి మిధున్ రెడ్డి విజయం సాధించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.