అవిశ్వాసానికి కేంద్రం సిద్ధమవడానికి కారణం ఇదే..!

అక్కడ జరిగేది వర్షాకాల సమావేశాలే.. అయితేనేం కావాల్సినంత వేడి ఉంది.. దీనికి కారణం అవిశ్వాస తీర్మానం. అవును అవిశ్వాస తీర్మానం పార్లమెంట్ సమావేశాల్లో కాక రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చకు కారణమవుతోంది. ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఎన్డీయే నుంచి నిష్క్రమించిన టీడీపీ.. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గత బడ్జెట్ సమావేశాల సమయంలో కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే, అప్పుడు సభలో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎంపీలతో పాటు మరికొన్ని పార్టీల సభ్యులు గందరగోల పరిస్థితులు సృష్టించారు. దీంతో అది కాస్తా చర్చకు రాకుండానే సమావేశాలు ముగిసిపోయాయి. ఆ సమయంలో బీజేపీ అవిశ్వాసాన్ని ఎదుర్కొనలేకే తమ మిత్రపక్ష పార్టీలతో కలిసి ప్లాన్ చేశాయని పలు ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో మరోసారి అవిశ్వాసం అంశం తెరపైకి వచ్చింది.

సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్, తెలుగుదేశం, శరద్ పవార్ నేషనలిస్ట్ పార్టీలు తాజాగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం.. దానికి సభాపతి ఆమోదం తెలపడం చక చకా జరిగిపోయింది. ఈ సారి అవిశ్వాసాన్ని ఆమోదించడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. సంవత్సర కాలంగా పార్లమెంట్‌లో జరుగుతున్న వివిధ పరిణామాల వల్ల కేంద్రం చేయవలసిన, ప్రవేశ పెట్టవలసిన పలు కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని, అలాగే గత సమావేశాల్లో వచ్చిన చెడ్డ పేరును పోగొట్టుకున్నట్లు అవుతుందని అవిశ్వాసానికి ఆమెదం తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు, అవిశ్వాసంపై చర్చ తర్వాత విపక్షం నోరు మూయించి అనుకున్న బిల్లులన్నీ నెగ్గించుకోవాలని మోదీ సర్కారు తలపోస్తోంది. అందులో భాగంగానే స్పీకర్‌ తీర్మానాన్ని అనుమతించారు. ఎలాగో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఎక్కువ మందే ఉండడం వల్ల అవిశ్వాసం వీగిపోతోందని, తర్వాత కీలక బిల్లులను ప్రవేశపెట్టవచ్చని బీజేపీ భావిస్తోందట.

అంతేకాదు గత బడ్జెట్‌ సమావేశాల్లో అప్పటి వరకు తమతో కలిసి పని చేసిన తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందని ప్రధాని మోదీ ఊహించలేదు. దానిపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా నాన్చడం, తీర్మానమే చర్చకు రాకుండా తప్పించుకోవడం ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపింది. అవిశ్వాసం సవాలును స్వీకరిస్తే నీరవ్‌ మోదీ కుంభకోణం, దళితులపై దాడులు తదితర అంశాలపై విపక్షం దాడి చేస్తుందని, దాని ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో పడుతుందని మోదీ భావించారు. పార్లమెంటును స్తంభింపజేసిన పాపం విపక్షం మీద తోసేశారు. అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకొనేందుకు కొన్ని పార్టీలను నాటకీయంగా రంగంలోకి దించారు. సభ సజావుగా సాగడం లేదన్న వంకతో స్పీకర్‌ చర్చను అనుమతించలేదు. వీటివల్ల లాభం జరగకపోగా ప్రధాని ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో వర్షాకాల సమావేశాల్లో వ్యూహం మార్చారు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.