గందరగోళంలో రేవంత్ బ్యాచ్

తెలంగాణలో జరనున్న ముందస్తు ఎన్నికలు పలువురు నేతల తలరాతను మార్చనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గతంలో మంచి పట్టు ఉన్న టీడీపీ ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందికర పరిస్ధితుల్లో చిక్కుకుంది. స్థానికంగా క్యాడర్ ఉన్నప్పటికీ బలమైన నేతలు లేక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొందని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కొందరు నేతలు రేవంత్ రెడ్డిని నమ్ముకుని, ఆయన వెంట నడిచి కాంగ్రెస్ లో చేరారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుంచి రాజారాం యాదవ్, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి… ముగ్గురు నేతలు టీడీపీలో ఉన్నప్పడు రేవంత్ వెంట ఉన్నారు. పైగా ఈ మూడు నియోజక వర్గాల సీట్లపై రేవంత్ బ్యాచ్ దృష్టి పెట్టింది. అలాగే రేవంత్ కోటాలో కనీసం ఒక్కసీటైనా ఖాయమని ఆశపడ్డారు. అయితే పార్టీ సీనియర్ల నుంచి టికెట్ల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో రేవంత్ వర్గం భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని తెలుస్తోంది. కనీసం టీడీపీలో కొనసాగివున్నా కూటమి సర్దుబాటులో తమకు టికెట్టు దక్కేవని రేవంత్ వర్గం నేతలు అంతర్మథనం చెందుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో గల ఆర్మూర్, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ లలో కాంగ్రెస్ సీనియర్ నేతలకు వలస నేతలకు మధ్య టికెట్ల పంచాయతీ తలెత్తింది. దీంతో ఈ మూడు సెగ్మెంట్లలో అభ్యర్దుల ఎంపిక విషయం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 6 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తయినట్టు తెలుస్తోంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో మాత్రం గందరగోళం కొనసాగుతోందని సమాచారం. కాగా ఆర్మూర్ నియోజక వర్గం నుంచి రేవంత్ బ్యాచ్ కు చెందిన నేత రాజారాం యాదవ్ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఆకుల లలితకు టికెట్టు ఖరారు చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రూరల్‌లో రేవంత్ వర్గానికి చెందిన అరికెల నర్సారెడ్డికి, ఆమధ్య కాంగ్రెస్ తీర్థం తీసుకున్న ఎమ్మెల్సీ భూపతి రెడ్డి నుంచి టిక్కెట్ కోసం గట్టి పోటీ ఎదురుకానుందని సమాచారం. మరోవైపు ఈ నియోజకవర్గం పొత్తులో భాగంగా టీడీపీకి టిక్కెట్ దక్కితే ఆ ఫార్టీ నేత మండవ వెంకటేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉందని భోగట్టా. మరోవైపు ఎల్లారెడ్డి నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, నల్లమడుగు సురేందర్ టిక్కెట్ రేసులో ఉన్నారు. కాగ ఇదే స్థానాల టిక్కెట్ల కోసం టీజేఎస్ కూడా పట్టుబడుతోందని తెలుస్తోంది. ఎలాచూసినా ఎన్నికల సమయంలో కేవలం రేవంత్ రెడ్డి తోపాటు ఆయనను నమ్ముకున్న నేతల పరిస్ధితి కూడా గందరగోళంలో పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.