తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో అరుదైన సన్నివేశమిదే

నందమూరి తారక రామారావు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పడి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగానే చూస్తూ వస్తోంది ఆ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పలుమార్లు ఓడించిన తెలుగుదేశం.. అదే పార్టీ చేతిలో కూడా పరాజయం పాలైంది. ఇన్ని సంవత్సరాలు ప్రత్యర్థులుగా ఉన్న ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు కలిశాయి. 2014 ఎన్నికల్లో కలిసి పని చేసిన భారతీయ జనతా పార్టీ.. ఏపీ ప్రజలను మోసం చేసిందనే కారణంతో టీడీపీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆ పార్టీపై పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇదే సమయంలో తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహాకూటమి ద్వారా ఈ రెండు పార్టీలు జతకట్టాయి. సీట్ల సర్ధుబాటు కూడా పూర్తయిపోయింది. ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి. ఈ క్రమంలో మొన్నటి వరకు విమర్శలు చేసుకున్న వారే ఇప్పుడు కలిసి తిరుగుతున్నారు. ఒకరి గెలుపు కోసం మరొకరు కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ-కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో కొన్ని అరుదైన సన్నివేశాలు ఆవిష్కృతమవుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ భవన్ ప్రధాన కార్యాలయంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది జాతీయ కార్యాలయం అయింది. పార్టీ అధినేత చంద్రబాబు ఏపీలో వ్యవహారాలు చూసుకుంటుంటే తెలంగాణ నేతలు మాత్రం ఎన్టీఆర్ భవన్ వేదికగానే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ భవనే అరుదైన సన్నివేశానికి వేదికైంది. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే తొలిసారిగా ఎన్టీఆర్‌ భవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాకూటమి (కాంగ్రెస్‌) జూబ్లీహిల్స్‌ అభ్యర్థి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్‌ భవన్‌కు ర్యాలీగా వచ్చారు. అక్కడే ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, చంద్రబాబుకు మద్దతుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ నేతలతో కలిసిమెలిసి గడిపారు. వాళ్లు ఉన్నంతసేపు ఎన్టీఆర్ భవన్ సందడిగా కనిపించింది. ఈ అరుదైన సన్నివేశాన్ని చూసిన వారందరూ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని కామెంట్లు చేస్తున్నారు. ముందు ముందు ఇంకెన్ని వింతలు కనిపిస్తాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.