‘ఎన్టీఆర్’లో చంద్రబాబు పాత్రకు హీరో ఫిక్స్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమాకు ‘ఎన్టీఆర్’ అని పేరు కూడా పెట్టేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. బసవతారకమ్మ పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎన్టీఆర్ జీవితంలో ఆయన అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాత్ర కూడా చాలా కీలకం. కాబట్టి, ఆయన క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారనే ఆతృత సినీ అభిమానులను కలచి వేసింది. దీనిపై ఎన్నో ఊహాగానాలు ఫిలింనగర్‌ సర్కిల్లో హల్‌చల్ చేశాయి. తాజాగా ఈ విషయంపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది. తెరపై చంద్రబాబుగా కనిపించే హీరో ఎవరో హింట్ వచ్చేసింది.

గతంలో ఈ పాత్రను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు, యంగ్ హీరో రానా చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా జరిగిన రెండు పరిణామాలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. తాజాగా రానా ‘‘ఎన్టీఆర్‌ అని పిలవబడే మహోన్నత వ్యక్తి కథను ప్రేక్షకులు అందరికీ చెప్పడానికి మేము కలిసి వస్తున్నాం’’ అని బాలకృష్ణ, క్రిష్‌తో కలిసి దిగిన ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇందులో తాను సినిమా చేస్తున్నట్లు అంగీకరించాడు కానీ, ఎవరి పాత్రలో నటిస్తున్నాననేది మాత్రం చెప్పలేదు. అంతేకాదు, ఏపీ సీఎం చంద్రబాబుతో ఈ ముగ్గురు భేటీ అయ్యారు. ఈ భేటీలో రానాను బాలకృష్ణ.. చంద్రబాబుకు పరిచయం చేశారని, పాత్ర విషయంలో సీఎం నుంచి రానా నుంచి కొన్ని సలహాలు తీసుకున్నాడని తెలుస్తోంది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, రానానే చంద్రబాబు క్యారెక్టర్ చేస్తున్నాడనేది మాత్రం నిజమని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.