చంద్రబాబే నడిచొస్తున్నట్లు ఉంది

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న చిత్రం ‘‘ఎన్టీఆర్’’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. బసవతారకమ్మ పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ పాత్రలో వాళ్లు నటిస్తున్నారు.. ఈ పాత్రలో వీళ్లు నటిస్తున్నారు అని పలు వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన వార్తలు చంద్రబాబు పాత్ర గురించి వచ్చిన వార్తలే హైలైట్‌గా నిలిచాయి. ఆయన పాత్రను యంగ్ హీరో దగ్గుబాటి రానా నటిస్తున్నాడని చాలా వార్తలు వచ్చాయి. తర్వాత రానా.. చంద్రబాబును కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. తర్వాత క్లీన్ షేవ్‌, పాత తరం హెయిర్‌ స్టైల్‌తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇక ఈ ఫొటో చూసిన తర్వాత రానానే చంద్రబాబు పాత్ర చేస్తున్నాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా సినిమాకు సంబంధించిన పిక్ ఒకటి లీక్ అవడం.. అందులో రానా.. చంద్రబాబులా కనిపిస్తుండడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు యంగ్ ఏజ్‌లో ఎలా ఉండేవారో, ఎలాంటి బట్టలు వేసుకునేవారో సేమ్ అలాగే రానా ఈ పిక్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫొటో చూసిన వారందరూ చంద్రబాబే నడిచొస్తున్నట్లు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పాత్రను చేయడానికి రానా అనేక కసరత్తులు చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలనుకున్న రానా.. కొద్దిరోజుల క్రితం ఆయనను కలిసి కొన్ని సలహాలు తీసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కొన్ని పాత వీడియోలను చూస్తూ ఆయన బాడీ లాంగ్వేజ్‌ను పట్టుకున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో రానా ‘లీడర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాల్లో పొలిటీషియన్‌గా నటించాడు. ఈ కారణంగానే రానా అయితేనే బాగుంటుందని, చంద్రబాబు పాత్ర కోసం అతడిని ఎంపిక చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫొటోనే ఇలా ఉందంటే సినిమాలో రానా ఎలా ఉంటాడో అన్న ఆసక్తి కలుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.