నేతల రైతు జపం…రుణమాఫీ గొప్పలు…

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. తాను లక్ష రూపాయలు మాఫీ చేశానని చెబుతున్నారు ఇంకోవైపు సిఎం కేసీఆర్. ఏపీలో తాను అదే పని చేశానని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్నాటకలో రైతు రుణమాఫీ చేస్తానని హామీనిచ్చారు కుమారస్వామి. యడ్డూరప్ప, సిద్దరామయ్యలు అదే మాట చెప్పిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సిఎం అదే మాట అంటున్నారిప్పుడు. మొత్తంగా రైతులను ఆకట్టుకునేందుకు వారి ఓట్లు పొందేందుకు నేతలు సిద్దమయ్యారని అర్థమవుతోంది. 
రూ.2 లక్షల రుణమాఫీని రైతాంగం స్వాగతిస్తుంటే సీఎం కేసీఆర్‌ కు ఇబ్బంది వచ్చి పడింది. దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్రూం ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తామన్న కేసీఆర్ వాటి సంగతి పట్టించుకోలేదు. కానీ రైతు బంధు పథకం ద్వారా రూ.8 వేలను ఎకరానికి ఇచ్చేప్రయత్నం చేస్తున్నారు. ఏడాదికి..రూ.12 వేల కోట్లను పంచే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఎన్నికల ముందు ఇలాంటి హామీలు ఇవ్వడంతో అందరి చూపు రైతుల పై పడింది. ఎవరికి వారే రైతులను ఆదుకునేందుకు పావులు కదుపుతున్నారు. 
వ్యవసాయం, రైతులపై మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. రైతుల ఆత్మహత్యలు నివారించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. కానీ 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత మాదని చెబుతున్నారు కేసీఆర్. ఇలా ఎవరికి వారే రైతుల కోసం మేము చేసేది గొప్ప అని చెప్పుకుంటున్నారు. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీని నాలుగు దఫాలుగా చేయడంతో వడ్డీ భారాన్ని రైతులు భరించలేకపోయారు. మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం, పేదల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వేరు శనగ సాగుపై క్వింటాకు రూ.1,200 నష్టం వస్తుంటే రూ.4 వేల పెట్టుబడి సాయం రైతును ఎలా ఆదుకుంటుందనే ప్రశ్న లేకపోలేదు. మేము అధికారంలోకి వస్తే రైతు రుణాలను మొత్తం మాఫీ చేస్తామని జగన్ పార్టీ ప్రకటించడంతో మొత్తంగా తెలుగు రాష్ట్రాలే కాదు..పాలకులంతా రైతు జపం చేస్తున్నారని అర్థమవుతోంది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.