రాహుల్‌కు ఏపీ విషయంలో క్లారిటీ వచ్చేసిందిగా.!

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిని కోల్పోయి ఇబ్బంది పడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇలాగే నాలుగేళ్లు నెట్టుకొచ్చిన ఆ పార్టీ.. ఎన్నికలు సమీపిస్తున్నందున స్పీడు పెంచింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపించాలనుకుంటోంది. అలాగే ఏపీ ప్రజల దృష్టిలో తమ పార్టీపై ఉన్న అపవాదును పోగొట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉందని చెప్పాలి. అందుకోసమే అక్కడ అధికారం సాధించాలన్న పట్లుదలతో ఉంది. ఒకవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూనే, మరోవైపు అధికారంలోకి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఫలితంగా ఆ పార్టీ తెలంగాణలో బలపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న సమీకరణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలమన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో పెరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. దీనికి మరింత బలాన్ని చేకూర్చే క్రమంలోనే ఆ పార్టీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

అయితే, ఏపీ విషయంలో మాత్రం రాహుల్ అభిప్రాయం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీకి చెందిన నేతలు కొందరు ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ కలిశారట. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడాలంటే మీరు పర్యటించాలని కోరారని, దీనికి ఆయన అఇష్టత చూపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏపీ విషయంలో రాహుల్‌కు ఉన్న క్లారిటీనే టాక్ వినిపిస్తోంది. విభజన వల్ల ఆ పార్టీకి ఏపీ ఓటర్లు గత ఎన్నికల్లో ఇచ్చిన ఫలితాలను బట్టి పార్టీ పరిస్థితిని కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందువల్లే రాహుల్ ఏపీ విషయాన్ని లైట్ తీసుకున్నారని వినికిడి. తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఇదే విషయంపై మాట్లాడడం చర్చనీయాంశం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏం చేసినా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాలేమని, కానీ గత ఎన్నికల కంటే మంచి ఫలితాలనే సాధిస్తామని చెప్పాడు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వాస్తవానికి రాహుల్ చెప్పినదాంట్లో వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చూసిన వారికి ఈ విషయం అర్థమైపోతుంది. కాకపోతే ఆయన ఇలా బహిరంగంగా ప్రకటించడం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.