పార్లమెంట్‌లో ఊహించని ఘటన

దేశ రాజకీయాలను అవిశ్వాసం ఊపేస్తుంది. ఏ ఛానెల్ చూసినా.. ఎవరి నోట విన్నా దీని గురించే చర్చ జరుగుతోంది. ఏపీకి అన్యాయం చేసిందనే కారణంతో ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన టీడీపీ.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం.. దానిని స్పీకర్ ఆమోదించడం.. ఈరోజు చర్చ జరగడం అంతా తెలిసిందే. పేరుకు వర్షాకాల సమావేశాలే అయినా.. ఈ సారి సమావేశాలు మాత్రం చాలా వేడి వేడిగా జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో పార్లమెంట్‌ను రాగా స్టైల్ చల్లబరిచింది. హాట్ హాట్‌గా జరుగుతున్న ప్రసంగాలతో రణరంగంలా మారిన సభను రాగా స్టైల్ మార్చేసింది. రాగా స్టైలా..? అదేంటి ఇలాంటిది మేమెక్కడా వినలేదే అనుకుంటున్నారా..? రాగా అంటే ఏదో అనుకుని కంగారు పడకండి.. దాని అర్థం రా.. అంటే రాహుల్, గా అంటే.. గాంధీ మొత్తంగా రాహుల్ గాంధీ స్టైల్ అన్నమాట. దాదాపు పదిహేనేళ్ల తర్వాత పార్లమెంట్‌లో అవిశ్వాసం గురించి చర్చ జరుగుతుండగా ఎవరూ ఊహించని పరిణామం జరిగింది. ఓ వైపు ప్రతిపక్ష ఎంపీలు.. మరోవైపు విపక్షాల ఎంపీలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న వేళ.. పార్లమెంట్‌లో ఓ అరుదైన, ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సభ్యులందరూ షాక్‌కు గురయ్యారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సభలో ప్రధానిపై, బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల అవినీతి అక్రమాలపై, కేంద్ర ప్రభుత్వ పని తీరుపై నిప్పులు చెరిగిన రాహుల్.. ప్రసంగం అనంతరం నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి కౌగిలించుకున్నాడు. వెంటనే తిరిగి వస్తున్న సమయంలో మోదీ.. రాహుల్‌ను పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం తట్టారు. దీంతో సభలో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి వచ్చి తన సీటులో కూర్చున్న రాహుల్.. తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను కొడుతూ కనిపించారు. దీంతో రాహుల్ తీరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదంతా పక్కన పెడితే రాహుల్ చేసిన పనులకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. రాహుల్ వీడియోను ‘‘రాగా స్టైల్’’ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో కొద్ది సమయంలోనే అది ట్రెండింగ్‌లో చేరింది. అయితే బీజేపీ వాళ్లు మాత్రం రాహుల్ ఇంకా ఎదగలేదని, అతడిది చిన్న పిల్లల మనస్థత్వమని విమర్శలు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.