కేటీఆర్ మాట‌కు ఆర్కే ఇంత ప్ర‌యారిటీ ఇస్తున్నారా?

ఎవ‌రెన్ని చెప్పినా.. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. ఒక ప్రాంతానికి సంబంధించిన రాజ‌కీయాల మీద మ‌రో ప్రాంతానికి ఉండే ఆస‌క్తిని ఎవ‌రూ తుడిచేయ‌లేరు. నిజానికి.. విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో ఏమైంద‌న్న ధ్యాస ఆంధ్రాలో.. ఏపీలో ఏం జ‌రుగుతోంద‌న్న ఉత్సుక‌త తెలంగాణ‌లోనూ నెల‌కొంది.
ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీలో ఎంత ఆస‌క్తి వ్య‌క్త‌మైందో తెలిసిందే. అక్క‌డితో ఆగ‌ని వారు.. తెలంగాణ‌లో కేసీఆర్ గెలుపోట‌ముల మీద భారీగా బెట్టింగులు కాచి బాగుప‌డినోళ్లు ఉన్నారో.. నాశ‌న‌మైపోయినోళ్లు ఉన్నారు. బెట్టింగుల్లో లాభ‌ప‌డినోళ్ల కంటే న‌ష్ట‌పోయినోళ్లే ఎక్కువ‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీతో గెలిచిన అనంత‌రం కేసీఆర్.. ఆయ‌న పుత్ర‌ర‌త్నం కేటీఆర్ ల్లో విజ‌య‌గ‌ర్వం ఎంత‌లా  పెరిగిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. గెలుపునిచ్చే ఆత్మ‌విశ్వాసం వారి మాట‌ల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంది. కొద్ది వారాల క్రితం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేటీఆర్‌.. మాట‌ల మ‌ధ్య‌లో ఒక సందేశాన్ని సూటిగా.. సుత్తి లేకుండా ఇచ్చేశారు.
తెలంగాణ‌లో ఆంధ్రా వార్త‌లు ఎందుక‌న్న ఆణిముత్యం లాంటి మాట ఆయ‌న నోటి నుంచి వ‌చ్చేసింది. మీడియా సంస్థ‌లేవీ కేసీఆర్ స‌ర్కారు పోషించే సంస్థ‌లు కావు. ఎవ‌రికి వారు.. వారి వారి దృక్ప‌ధానికి అనుగుణంగా వార్త‌లు ఇస్తుంటారు. వారి లాభ‌న‌ష్టాల‌తో ప్ర‌భుత్వాల‌కు సంబంధం లేవు. అయితే.. వారిచ్చే వార్త‌ల్లో నిజం ఉందా?  లేదంటే మ‌సిపూసి మారేడుకాయ అన్న‌ట్లుగా క‌ట్టుక‌థ‌ల‌తో రాస్తున్నారా? అన్న‌ది మాత్ర‌మే చూడాలి.
అంతేకానీ.. ఎవ‌రేం వార్త‌లు రాయాలో.. ఏ వార్త‌కు ఎంత ప్రాధాన్య‌త ఇవ్వాలో చెప్పాల్సిన అవ‌స‌రం కేటీఆర్ కు అస్స‌లు లేదు. అయితే.. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్న‌ట్లుగా ప్ర‌జ‌లు భావిస్తున్నార‌న్న భావ‌న వారిలో పెరుగుతున్న కొద్దీ వారి నోట వెంట వ‌చ్చే మాట‌ల్లో మార్పు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. కేటీఆర్ నోటి నుంచి ఆంధ్రా వార్త‌లు తెలంగాణ‌లో ఎందుక‌న్న విష‌యాన్ని ఈనాడు పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ప్ప‌టికి.. ఆంధ్ర‌జ్యోతి మాత్రం బాగా ప‌ట్టించుకున్న‌ట్లుగా చెబుతున్నారు.
గ‌తంలో ఆంధ్రా వార్త‌ల్ని జ్యోతి ఇచ్చినంతగా ఈనాడు ఇవ్వ‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌య్యేది. ఇప్పుడు అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. తాజా ఉదంతాన్నే చూస్తే.. ఏపీలో ప‌ర్య‌టించిన మోడీ బాబు స‌ర్కారును చెడామ‌డా తిట్టేశారు. నోటికి బాగానే ప‌ని చెప్పారు.  మోడీకి కౌంట‌ర్ ఇచ్చే విష‌యంలోనూ బాబు త‌గ్గ‌లేదు. ఆయ‌న కూడా తీవ్రంగానే మాట‌లు అనేశారు.  మ‌రింత వాడివేడిగా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న వేళ‌.. తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్రాధాన్య‌త అంశం ఎందుకు కాకుండా పోతుంది?
అందుకే కాబోలు తెలంగాణ ప‌త్రిక‌గా పేరున్న వెలుగు సైతం ఈ ఇష్యూకు భారీ ప్రాధాన్య‌త ఇచ్చింది. ఈనాడు గురించి
చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక‌.. జ్యోతి మాత్రం అందుకు భిన్నంగా.. ప్రాధాన్య‌త త‌గ్గించి ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. చూస్తుంటే.. కేటీఆర్ నోటి వెంట వ‌స్తున్న మాట‌ల్ని జ్యోతి రాధాకృష్ణ‌(ఆర్కే) ప‌క్కాగా ఫాలో అవుతున్న‌ట్లుగా ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. వింటున్నారా.. ఆర్కేజీ?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.