నువ్వు చెప్పకపోతే ఆ విషయం వాళ్లకు తెలియదా పవన్..?

తెలుగుదేశం పార్టీతో విభేదించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో హైలైట్ అయ్యాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇటు తెలంగాణలోనూ తనదైన శైలి రాజకీయం చేస్తూ ఇక్కడా హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో చెప్పిన పవన్.. అందుకు తగ్గట్లు పార్టీ ముఖ్య నేతలతో కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ, ఎన్నికల్లో పోటీ మాత్రం చేయలేదు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో నిర్ధేశిత కాల పరిమితిలో ఎన్నికలు జరిగినట్లైతే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఒక ప్రణాళికను రూపొందించుకున్నాము. అయితే ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒకింత కష్టతరంగా భావించాము. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యం. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగింది. శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని తెలంగాణ ప్రజలకు వినయపూర్వకంగా తెలియజేస్తున్నాము- జైహింద్’’ అంటూ అధికారిక ప్రకటన చేశాడు.

తెలంగాణలో పోటీ అయితే చేయడంలేదు కానీ, ఎవరికి మద్దతిస్తామో త్వరలోనే ప్రకటిస్తామని చెప్పాడు. మూడు రోజుల క్రితం ‘‘తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియపరుస్తాము’’ అని పవన్ ట్వీట్ చేశాడు. దీంతో పవన్ ఏ పార్టీకి మద్దతిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురు చేశారు. అయితే, జనసేన అధినేత బుధవారం ఊహించని విధంగా ప్రకటన చేశాడు. ‘‘ఎవరైతే ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో పాలన అందించగలరో ప్రజలందరూ ఆలోచించి వారికే ఓటేయండి’’ అంటూ పవన్ జనసేన కార్యకర్తలకు, తన అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇది చూసిన వారంతా ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. మద్దతిస్తామని చెప్పి ఇలా రొటీన్ డైలాగ్స్ చెప్పడం ఏంటని కొందరు.. నువ్వు చెప్పకపోతే నీతివంతులకు ఓట్లు వేయాలని మాకు తెలియదా అంటూ మరికొందరు పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు, జనసేనకు చెందిన కొందరు నేతలు టీఆర్ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరి ఇప్పుడు పవన్ చేసిన ప్రకటనతో వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.