జగన్ చెంతకు దగ్గుబాటి, పురందేశ్వరి?

ఏపీలోని పర్చూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. సీనియర్‌ రాజకీయ నాయకులు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయులతో రాజకీయ మంతనాలు జరపబోతున్నారంటూ ఒకవైపు ప్రచారం జరుగుతోంది. అలాగే మరోవైపు ఆయన నివాసంలో చేపట్టిన మరమ్మతులపై రాజకీయ అంచనాలు నెలకొన్నాయి. జగన్ పార్టీలో చేరే విషయం పై నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విరివిగా ప్రచారం జరుగుతోంది. మాజీమంత్రి, వైసీపీ ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో ఆయనను కలిసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఇంకొల్లులోని తన కుటుంబానికి చెందిన కళాశాలలో సమావేశం ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి సమావేశం జరగలేదని తెలుస్తోంది. ఇంకొక వైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చెందిన కారంచేడులోని నివాసగృహంలో స్వల్ఫ మరమ్మతులకు శ్రీకారం పలికారు. తనకిష్టమైన రీతిలో ఇంటి ఆవరణలో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన కుటీరాన్ని నిర్మించుకున్నారు. దానికి ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నారు. దీనిని రాజకీయ కార్యకలాపాలకు వినియోగించనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన లేక ఆయన కుమారుడు ఎన్నికల సమయంలో రావటానికే ఇవన్నీ చేస్తున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు దగ్గుబాటితో ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యులు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. కాగా 1989 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లోకి వచ్చిన ఎన్టీఆర్ అల్లుళ్లు దగ్గుపాటివెంకటేశ్వరావు, నారా చంద్రభాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ చనిపోయిన అనంతరం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడయి ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు.
తరువాత వెంకటేశ్వరావు కాంగ్రెస్ లోకి అడుగు పెట్టారు. ఎన్టీఆర్ కూతురు, వెంకటేశ్వరావు  భార్య పురందేశ్వరి కూడా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2004 లో కాంగ్రెస్ పార్టీ తరుపున బాపట్ల ఎంపీ స్థానానికి పోటీచేసి గెలిచారు తరువాత 2009 లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుండే మళ్లీ గెలిచి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, అది అడ్డగోలు విభజన గా భావించిన ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి లోనై కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. దీంతో పురందేశ్వరి బీజేపీ లో చేరారు. తరువాత గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె కూడా జగన్ పార్గీవైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.