పవన్ పోకడకు ప్రజారాజ్యం పార్టే కారణమా?

సినిమాల్లో ఆయన మెగాస్టార్.. కానీ రాజకీయాల్లో! ఆ సంగతి మీకే తెలుసు. తనకు కొండంత అభిమాన లోకం ఉంది కదా అని ప్రజారాజ్యం పేరుతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఘోరంగా విఫలమయ్యారు ఆయన. చివరకు పార్టీనే తీసుకెళ్లి వేరొక పార్టీలో కలిపేశారు. ఒక దశలో సినీ జీవితం వదిలేస్తాని చెప్పి.. మళ్ళీ దానినే కెరీర్‌గా ఎంచుకున్నారాయన. ఈ పాటికి ఆయనెవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది. అయితే ఆ స్టార్ పెట్టిన ప్రజారాజ్యం పార్టీ దెబ్బతినడానికి కారణం చెప్పాడు మరో స్టార్. జనసేనానిగా జనం ముందుకొచ్చిన పవన్.. ఇటీవల జరిగిన సమావేశంలో తన అన్నయ్య పార్టీ ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకొచ్చారు.

ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో తన అన్న చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని, కానీ ఆయన పక్కనున్న వారే ఆయన్ను నిరాశ పర్చారని పవన్ చెప్పటం గమనార్హం. అంతేకాదు ఇప్పుడు తనకు అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటానని కూడా చెప్పారు పవన్. అందుకేనేమో ఎవ్వరినీ దగ్గరకు రానీయకుండా అత్యంత జాగ్రత్త పడుతున్నారు ఈ జనసేనాని. ఇప్పటికే ఆయనకు అత్యంత సన్నిహితుడైన బండ్ల గణేష్ కాంగ్రెస్‌లో చేరగా.. పవన్ ప్రియ మిత్రుడు ఆలీ జనసేన వైపే చూడటం లేదు. ఇన్నాళ్లు వీళ్లంతా పవన్‌కి ఎందుకు దూరంగా ఉంటున్నారని తలలు పట్టుకున్న జనానికి ఇప్పుడాయన మాట్లాడిన మాటలతో ఓ క్లారిటీ వచ్చేసింది. అన్న పార్టీని పక్కనున్న వాళ్ళే కుంగలోకి తొక్కారు కాబట్టి.. తాను కూడా ఎంత ఆప్తులైనా వారిని దగ్గరకు రానీయటం లేదని, అందుకే పవన్ ఆప్తులు కూడా వేరే పార్టీ వైపు మొగ్గుతున్నారని జనాలు చర్చించుకుంటున్నారు.  

దృడ సంకల్పంతో పార్టీని స్థాపించాను.. వ్యక్తిగా బలపడేందుకు రాలేదు వ్యవస్థను బలపర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానంటూ పవన్ పేర్కొనటం వరకు బాగానే ఉంది. కానీ.. కొందరి వల్ల గతంలో అన్న పార్టీకి అన్యాయం జరిగిందని, ఆప్తులను దగ్గరకు తీస్తే ఇప్పుడు తనకు కూడా అలాగే జరుగుతుందని అనుకుంటూ ముందుకెళ్తే పవన్ అనుకున్న లక్ష్యం చేరగలుగుతాడా? అనేదే అసలు ప్రశ్న. పార్టీకి లీడర్ ఎంత ముఖ్యమో! అందులో పనిచేసే నాయకులు కూడా అంతే ముఖ్యం. కానీ పవన్ తీరు అలా లేదు. అన్నీ తానే అనేలా కనిపిస్తోంది ఆయన ధోరణి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనాని విజయ తీరాలకు చేరితే అది రికార్డే మరి!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.