పార్టీలపై ప్రకాశంవాసుల మనోగతం ఇదేనట!

ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రజల మనోగతం మెల్ల మెల్లగా వెల్లడవుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా బహిర్గతమవుతున్న ప్రజాభిప్రాయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఎంతో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపాలు ఆధిపత్యం కోసం నిరంతరం తలపడుతున్నాయి. గత ఎన్నికల్లో అధికార టిడిపి కన్నా మంచి ఫలితాలు సాధించిన వైకాపా ఇప్పుడు తిరిగి అటువంటి ఫలితాలను మళ్లీ సాధించాలని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వారి ప్రయత్నాలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తున్న వైనాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని  ‘పశ్చిమ’ ప్రాంతంలో వైసీపీని ప్రజలు ఆదరిస్తున్నారని, అధికార టిడిపిపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అసంతృప్తి తగ్గించడానికి అధికారపార్టీ పలు ప్రయత్నాలు చేస్తోందని భోగట్టా! జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగా లేదని స్వయంగా టిడిపి నాయకులే చెబుతుండటం విశేషం. మార్కాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున జంకే వెంకటరెడ్డి గెలుపొందారు. జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా, ఆయన పార్టీనే అంటిపెట్టుకుని ఉండడంతో ఆ వర్గానికి చెందిన వారు ఆయనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట! దీంతో వైసీపీ వర్గాలు మళ్లీ ఆయనే అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటుండంతో ఇక్కడ టిడిపి గెలవడం కష్టమైన పనేఅని వార్తలొస్తున్నాయి. యర్రగొండపాలెంలో డేవిడ్‌రాజు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. అయితే ఆయన ఆ తరువాత టిడిపి పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో కూడా ఆయన పనితీరు బాగాలేదని అన్నట్టు తెలుస్తోంది. అలాగే మరో నియోజకవర్గమైన ‘గిద్దలూరు’లో గత ఎన్నికల్లో వైకాపానే గెలుపొందింది.  ఇక్కడ గెలిచిన అశోక్‌రెడ్డి కూడా తరువాత టిడిపిలో చేరారు.
ఆయన పనితీరు కూడా బాగాలేదని సిఎం చంద్రబాబు హెచ్చరించారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు టిడిపి తరుపున పోటీ చేసిన అన్నే రాంబాబు పార్టీని వీడిపోవడం ఆ పార్టీకి లోటుగా మారింది. కందుకూరు నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి రోజు రోజుకు బలహీనపడుతున్నదని పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట!  గతంలో వైసీపీ నుంచి గెలిచి టిడిపిలో చేరిన పోతుల రామారావుపై ఓటర్లకు సదాభిప్రాయం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి, అయితే కాంగ్రెస్‌లో ఉన్న మాజీ మంత్రి మహిధర్‌రెడ్డి వైసీపీలో చేరడం ఆ పార్టీకి కలసి వస్తుందని, ఇక్కడ మళ్లీ వైసీపీనే గెలుస్తుందని స్థానికులు అంటున్నారు. అయితే కనిగిరిలో పరిస్థితి కొంచెం అటూ ఇటుగా ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన కదిరి బాబూరావు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన వైఖరితో ఇక్కడ పార్టీ బలహీనమవుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే దర్శి, సంతనూతలపాడు, కొండపి, చీరాలలో కూడా టీడీపీ పరిస్థితి అంతమెరుగ్గా లేదని అంటున్నారు. ప్రకాశం జిల్లాల్లో మారుతున్న రాజకీయాలు ఎక్కడికి దారితీస్తున్నాయో అవగతం కాని రీతిలో ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.