వైఎస్ఆర్ సీపీలో గురుశిష్యుల తారాస్థాయికి చేరిన గొడ‌వ‌

అక్కడ గురుశిష్యుల మధ్య సద్దుమణిగిందనుకున్న గొడవలు మళ్లీ పతాకస్థాయికి చేరాయి. వైఎస్‌ఆర్‌కు నిజమైన వారసులం తామేనంటూ ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో నియోజకవర్గంలో హీట్‌ పెంచుతున్నారు. చిత్తూరులో రాజకీయం కాసింత డిఫరెంట్‌గా ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారు.. మిత్రులుగా ఉన్నవారు శత్రువులవుతారు. గురుశిష్యుల మధ్య కూడా విభేదాలు వస్తుంటాయి.. ఫర్‌ ఎగ్జాంపుల్‌ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు.. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ జంగాలపల్లె శ్రీనివాసులులనే తీసకోండి.. ఒకప్పుడు గురుశిష్యులు.. ఇప్పుడు బద్ధ విరోధులు.. ఏడాది కిందట ఈ ఇద్దరి మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్షంగా మారింది.. వైఎస్‌ఆర్‌కు నిజమైన వారసులం తామంటే తామంటూ గొడవకు దిగుతున్నారు.. ఇరుపక్షాలవారు విమర్శలు.. ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు సరేసరి! సీకే బాబు అదేనండి సీకే జయచంద్రారెడ్డి గురించి ఇంట్రడక్షన్‌ అనవసరం.. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.  అనేక పదవుల్లో కొనసాగారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన బాబు ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.. ముఖ్య నేతగా ఎదిగారు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వీరవిధేయుడయ్యారు. గత ఎన్నికల ముందు వరకు సీకే బాబు మాటకు ఎదురుండేది కాదు.. ఇప్పుడు పరిస్థితి మారింది.. ఆయన రాజకీయభవితవ్యం అయోమయంగా మారింది.. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడిన సీకే బాబు చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చూపాలనుకున్నారు.. అన్ని స్థానాల్లోనూ తన అభ్యర్థులను బరిలో దింపారు.. అయితే కేవలం ఆరేడు స్థానాలు మాత్రమే ఈయన ఖాతాలో పడ్డాయి.. ఇక లాభం లేదనుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు.. అయినా పోటీ చేసే అవకాశం అప్పట్లో కలగలేదు.. ఇక జంగాలపల్లె శ్రీనివాసులు విషయానికి వస్తే.. తొలినాళ్లలో ఆయన సీకే బాబు ప్రియశిష్యుడు. ఆ క్రమంలోనే జంగాలపల్లె సర్పంచ్‌ అయ్యారు.. ఆపై ఎంపీటీసీ అయ్యారు. సీకే బాబుతో ఉన్న అనుబంధంతో చిన్నపాటి కాంట్రాక్టర్‌ కూడా అయ్యారు. అటు పిమ్మట అంచెలంచెలుగా ఎదుగుతూ బడా కాంట్రాక్టర్‌ స్థాయికి చేరుకున్నారు.
ఆ నేపథ్యంలోనే సీకే బాబును విడిచిపెట్టి టీడీపీలో చేరారు జంగాలపల్లె శ్రీనివాసులు. అక్కడ కొంత కాలం ఉండి ప్రజారాజ్యంలోకి వెళ్లారు.. ఆ పార్టీలో లాభం లేదనుకుని మళ్లీ టీడీపీలోకి వచ్చేశారు.. 2014 ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు.. పాపం ఏ పార్టీలోకి వెళ్లినా ఎమ్మెల్యే మాత్రం కాలేకపోయారు.. వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన మూడుసార్లు ఓటమే ఎదురయ్యింది.. 2014లో చోటు చేసుకున్న అనేకానేక రాజకీయ పరిణామాల కారణంగా సీకే బాబు తన శిష్యుడైన జంగాలపల్లె శ్రీనివాసులకు ప్రచారం చేయవలసి వచ్చింది.. తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని సీకే బాబు ఊహించి ఉండరు.. ఆ ఎన్నికల్లో జంగాలపల్లె ఓటమి చెందడంతో సీకే బాబు రాజకీయాలకు దూరమయ్యారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటూ వచ్చారు. గత ఏడాది జులై.. సెప్టెంబర్‌ మాసాల్లో వచ్చిన రాజశేఖర్‌రెడ్డి జయంతి.. వర్ధంతి కార్యక్రమాలను సీకే బాబు దంపతులు ఘనంగా నిర్వహించారు.. ఆ సందర్భంగా జంగాలపల్లె శ్రీనివాసులపై సెటైర్లు వేశారు.. వైఎస్‌కు వారసులం తామేనని చెప్పుకున్నారు.. చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకునే వాళ్లకు బుద్ధి చెప్పాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా జంగాలపల్లెపై వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ఆర్‌కు పేరును ఉపయోగించుకునే హక్కు తమకే ఉంటుందని సీకే బాబు సతీమణి లావణ్య చెప్పడంతో జంగాలపల్లె శ్రీనివాసులకు మండుకొచ్చింది.. వైఎస్‌ వారసులమని సీకే బాబు చెప్పుకోవడం సిగ్గుచేటనీ.. ఆయన మరణించినప్పుడు సీకే బాబు ఎలా స్పందించారో జనమంతా చూసిందని జంగాలపల్లె కౌంటర్‌ ఇచ్చారు.
జగన్ పార్టీ పెట్టినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆయన చెంతకు చేరారని.. సీకే బాబు మాత్రం పదవిని వదలకుండా ప్రభుత్వ నిధులు దోచుకున్నారని తీవ్రమైన వాఖ్యలు చేశారు జంగాలపల్లె. కార్పొరేషన్‌.. అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఓటమికి కారకులెవరైనా ఉంటే అది సీకే బాబేనని అన్నారు. ఇలా రెండు వర్గాలవారు తిట్టేసుకున్నారు.. ఆరోపణలు చేసుకున్నారు.. గొడవలు ముదరడంతో అధిష్టానం జోక్యం చేసుకోవలసి వచ్చింది.. సీకే బాబుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.. ఆ తర్వాత సీకే బాబు బీజేపీలో చేరారు. చిత్తూరు బీజేపీకి బలమైన నాయకుడు దొరికారంటూ కమలనాథులు సంబరపడ్డారు.. ఆ క్రమంలోనే చిత్తూరులో పలు పార్టీ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు సీకే బాబు.. నరేంద్రమోదీ పేరుతో ఓ పూలమార్కెట్‌ను కూడా ఏర్పాటు చేశారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రచారం చేశారు. తర్వాత ఏమైందో ఏమోగానీ బీజేపీ కార్యక్రమాలకు దూరమయ్యారు సీకే బాబు.. బీజేపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని సన్నిహితులు చెప్పడంతో సీకే బాబు ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలని డిసైడయ్యారు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ప్రకటించారు..ఆ క్రమంలోనే కార్పొరేషన్‌ పరిధిలోని మురకంబట్టు దగ్గర స్వతంత్రంగా పార్టీ ఆఫీసును ఆట్టహాసంగా ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సింబల్‌ను గుర్తుకు తెచ్చే విధంగా తన పార్టీ గుర్తును తయారు చేయించారు. 
ప్రతి డివిజన్‌లో ఇదే మాదిరి తన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.. చిత్తూరు నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న పూతలపట్టు.. గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలోని ప్రతి మండలంలోనూ ఇదే తరహా కార్యాలయాలను ఏర్పాటు చేసి.. ఆ నియోజకవర్గాల్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారట! మురకంబట్టులోని పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో టీడీపీ, వైకాపాలపై విమర్శలు చేశారు.. వీటికి జంగాలపల్లె కౌంటర్‌ ఇచ్చారనుకోండి.. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌ జయంతి వచ్చింది.. ఆ కార్యక్రమాన్ని కూడా సీకే బాబు ఘనంగా నిర్వహించారు. దీంతో జంగాలపల్లె శ్రీనివాసులు వర్గానికి కోపం వచ్చేసింది.. ఆయనపై ఘాటైన విమర్శలు చేసింది.. తీవ్రమైన పదజాలంతో తిట్టిపోసింది.. వైకాపాను ఓడించడానికే వైకాపా లోగోను కాపీ కొట్టారనీ.. జగన్‌ను ఓడించాలన్నదే సీకే బాబు ఉద్దేశమని జంగాలపల్లె శ్రీనివాసులు వర్గం ఆరోపించింది.ఇవతలిపక్షం కూడా తీవ్రంగానే స్పందించింది.. జంగాలపల్లె వర్గంపై ఎదురుదాడికి దిగింది.. సీకే బాబు దగ్గర రాజకీయపాఠాలు నేర్చుకుని.. ఆయన పెట్టిన భిక్షతో ఈస్థాయికి ఎదిగి ఆయననే విమర్శిస్తారా అంటూ స్వరం విప్పింది.. వైఎస్‌ విగ్రహానికి ఒక్కసారి కూడా పూలదండ వేయనివారు.. బతికుండగా ఆయనతో మాట్లాడని వారు కూడా వారసులం అని చెప్పుకోవడం హాస్యాస్పదమంటూ మండిపడింది.. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయమని.. అధికారంలోకి వచ్చే పార్టీలో చక్రం తిప్పడం కూడా ఖాయమని ప్రత్యర్థి వర్గానికి  సవాల్‌ విరిసింది.. ఇంత జరుగుతున్నా సీకే బాబు మాత్రం జంగాలపల్లెపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు.. ఆయన ప్రధాన అనుచరులు మాత్రం ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు.. బహుశా ఇది కూడా రాజకీయ వ్యూహమేమో! ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్న పోరు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.