నెల్లూరులో రాజ‌కీయ‌ ర‌గ‌డ‌

నెల్లూరు గడ్డకి ఘనమైన చరిత్ర ఉంది. రాజుల కాలంలో ఇక్కడ ఎన్నెన్నో యుద్ధాలు జరిగాయి. ఆనాటి కథలను నేటికీ ఇక్కడి జనం చెప్పుకుంటూ ఉంటారు. నాటి యుద్ధాల సంగతి అలా ఉంచితే.. ఈ మధ్య టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు కాలు దువ్వుకున్నారు. నెల్లూరులో సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మధ్య రాజకీయ సమరానికి తెరలేచింది. సహజంగానే నెల్లూరీయులది పెద్దనోరు అంటారు. గట్టిగానే విమర్శలు చేసుకుంటారు. అయితే ఈసారి పరిస్థితి కాస్త శ్రుతిమించింది. “నువ్వెంత?” అంటే “నీ పార్టీ ఎంత?” అని గేలి చేసుకున్నారు. “బహిరంగ చర్చకి రా..!” అంటే “నువ్వు రా..?” అని ఒకరినొకరు కవ్వించుకున్నారు. ఇంకేముంది? రెండు పార్టీల ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేశంతో రగిలిపోయారు. యుద్ధానికి కాలుదువ్విన అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిలు మాత్రం బరిలోకి దిగలేదు. కానీ ఇరుపక్షాల వారు గాంధీబొమ్మ సెంటర్‌లో వాలిపోయారు. నేతలంతా తమని తాము అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, బల్లాల దేవుడి మాదిరిగా ఊహించుకున్నారు. కార్యకర్తలంతా కట్టప్పలుగా ఫీలయ్యారు
తమ వల్లే పార్టీల మనుగడ అన్నంత రేంజ్‌లో బిల్డప్ ఇచ్చారు. నగర నడిబొడ్డున ఉన్న గాంధీబొమ్మ సెంటర్. సమయం పదిన్నర గంటలు. రెండు పార్టీల బలగాలు అటూ- ఇటూ మోహరించాయి. పరిస్థితి తుపాను ముందు ప్రశాంతతని తలపించింది. సరిగ్గా అప్పుడే పోలీసులు రంగప్రవేశం చేశారు. బహిరంగ చర్చకి అనుమతి లేదని ప్రకటించారు. ఇరు పక్షాలవారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. అయినప్పటికీ రెండు గంటలపాటు రచ్చ కొనసాగింది. ఒక వర్గంపై మరొక వర్గ నేతలు నోళ్లు పారేసుకున్నారు. మీరు దొంగలంటే, మీరు దొంగలని ఎద్దేవా చేసుకున్నారు. ఒకానొక దశలో పరిస్థితి చేయి దాటేలా కనిపించింది. పోలీసులు అప్రమత్తంగా లేకపోతే రెండు వర్గాలు కొట్లాటకి దిగేవే! నగరంలో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ప్రజలు సైతం భీతిల్లిపోయారు. కొట్లాట మొదలైతే ఎన్ని ప్రాణాలు పోతాయో అన్న ఆందోళన అందరిలో నెలకొన్నది. 
రెండు మూడు రోజుల ముందు నుంచే దీనికి సంబంధించి సంకేతాలు అందాయి. ఏ సెంటర్‌లో చూసినా.. రెండు పార్టీల వారు బీరాలు పోవడం కనిపించింది. బాహుబలి టైపు భారీ డైలాగులు కూడా పేల్చారు. మీ రక్తంతో నెల్లూరుకి అంటిన మకిలిని కడిగేస్తామని ఒకరంటే.. మీ రక్తంతోనే కడిగేస్తామని మరో వర్గం కారాలు- మిరియాలు నూరింది. చివరాఖరికి ఇరుపక్షాల వారు సమరానికి దిగడంతో పోలీసులు రంగంలోకి వచ్చి.. బ్రేకులు వేశారు. దీంతో చల్లబడిన అనిల్‌కుమార్ వర్గీయులు, కోటంరెడ్డి వర్గీయులు ఇంటిదారి పట్టారు. నెల్లూరులో పరిస్థితి ఇంతగా వికడించడంపై స్థానికులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు- శాశ్వత మిత్రులు ఉండరు. నాయకులు ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు మరో పార్టీలో ఉంటారు. అలాంటివారి పక్షాన వకల్తా పుచ్చుకుని కార్యకర్తలు, అనుయాయులు ఘర్షణకి దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ ఈ పరిణామానికి కారణం ఏంటని మీకు డౌటొస్తోంది కదూ? అక్కడికే వస్తున్నా. ఇవిగో… ఇవి పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు. ఆరు నెలల కిందట ప్రారంభించి సుమారు అయిదు వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. వారానికి, పది రోజులకొకసారి మంత్రి నారాయణ ఇక్కడికి వచ్చి పనులు పరిశీలిస్తూ ఉంటారు. లబ్ధిదారులని అడిగి, వారికి కావాల్సిన విధంగా మార్పు- చేర్పులు చేస్తూ వచ్చారు. అంతా సజావుగా ఉంటే గత నెలలోనే ఇవి ప్రారంభం కావల్సింది. ఢిల్లీలో మారిన పరిణామాలతో ఆలశ్యమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తెరపైకి వచ్చారు. పేదల ఇళ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కావాలంటే రుజువు చేస్తానని సవాల్‌ విసిరారు. దమ్ముంటే బహిరంగ చర్చకి రావాలంటూ కాలుదువ్వారు. దీనిపై టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్పందించారు. అనిల్‌కుమార్‌కి ఘాటుగా బదులిచ్చారు.
బహిరంగ చర్చకి సిద్ధమంటూ ప్రతి సవాల్‌ విసిరారు. సవాళ్లు అయితే చేసుకున్నారు కానీ చివరి నిముషంలో ఈ ఇద్దరు నేతలు ఇళ్ల నుంచి బయటకి రాలేదు. తమ తమ అనుయాయులను సమరానికి పంపించారు. మంత్రి నారాయణ కూడా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటున్న ఆరోపణను కొట్టిపారేశారు. “ఓపెన్ టెండర్లు పిలిచాం. అప్పుడు వైసీపీ వారే తక్కువ ధర కోట్‌చేసి కాంట్రాక్ట్ దక్కించుకోవచ్చు కదా?” అని కౌంటర్ ఇచ్చారు. “ఇవన్నీ కాదు. అక్రమాలకి పాల్పడ్డారని ప్రజలకి చెప్పండి. వారు నమ్మితే సరే! వారి కళ్లతో వారే చూస్తున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆరు నెలల్లో అయిదు వేల ఇళ్లు పూర్తిచేశాం” అని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ మాటకి ఎలా కౌంటరివ్వాలో అర్థంకానట్టుంది. ప్రస్తుతానికైతే- వైసీపీ నేతలు ఈ విషయంపై నోరు మెదపడం లేదు. ఇదండీ సింహపురిలో చోటుచేసుకున్న తాజా  సంఘటన! మొత్తానికి యుద్ధం తప్పినందుకు నగర ప్రజలు మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.