స‌ర్వేలు రాజ‌కీయ నాయ‌కుల‌ను భ‌య‌పెడుతున్నాయి…..

ఇది సర్వేల కాలం. అన్ని పార్టీలు సర్వేలను నమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోనూ ఇదే జరుగుతోంది. నేతలకు సర్వేల ఫీవర్ పట్టుకుంది. స్థానిక నేతలకు తెలియకుండానే ప్రధానపార్టీల ముఖ్య నేతలు సర్వేలు చేయిస్తున్నారు. అధినాయకత్వానికి నివేదికలు పంపుతున్నారు. దీంతో ఆశావాహుల్లో సర్వే టెన్షన్ నెలకొన్నది. ఓవైపేమో నాయకుల టికెట్ల గోల.. మరోవైపేమో రాజకీయపార్టీలు చేస్తున్న సర్వేలు.. దీంతో కర్నూలు రాజకీయం కాసింత వేడెక్కింది.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ల హడావుడి పెరిగింది.. నేతలంతా తమ అధినేతల కరుణాకటాక్షాల కోసం వ్యూహాత్మకంగా వెళుతున్నారు.. ప్రధానపార్టీల అధినాయకత్వాలు కూడా అదే స్థాయిలో దూకుడుగా వెళుతున్నాయి.. ప్రజలలో తమకు బోలెడంత క్రేజ్‌ ఉందనీ.. వచ్చే ఎన్నికలలో టికెట్‌ ఇస్తే బంపర్‌ మెజారిటీతో గెలుస్తామని కొందరు చెప్పుకుంటున్నారు.. కొందరేమో నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశామనీ.. ప్రజలు తమకే పట్టం కట్టాలనుకుంటున్నారని అంటున్నారు.. ఒక్క ఛాన్స్‌ ఇస్తే తామేంటో రుజువు చేసుకుంటామని అధినేతలకు విన్నవించుకుంటున్నారు.
సొంతంగా చేయించుకున్న సర్వే రిపోర్టులు పుచ్చుకుని హైకమాండ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలే కాదు.. జనసేన..బీజేపీలు కూడా దమ్మున్న అభ్యర్థుల కోసం గాలిస్తున్నాయి.. తమ నాయకులు ఇచ్చే రిపోర్టులను స్వీకరిస్తూనే.. ఆ నివేదకలోని నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. నియోజకవర్గాలలో ఏ నాయకుడికి ఎంత బలం ఉంది..? టికెట్‌ ఇస్తే గెలుస్తారా..? ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది..? ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది..? ఇత్యాది అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టుగా తెలిసింది.. అధికార తెలుగుదేశంపార్టీ ఇంటెలిజెన్స్‌ ఇచ్చే నివేదికలతో పాటు ప్రయివేటు సంస్థలతో కూడా సర్వే చేయిస్తోంది.. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ … బీజేపీ.. జనసేనలు కొంతమంది యువకుల ద్వారా రహస్యంగా సర్వే చేయించాయట! వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీల అధినాయకత్వాలు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చాయట! టికెట్‌ ఆశిస్తున్న నాయకుల పనితీరుపై సూక్ష్మ పరిశీలన చేసిన తర్వాత.. ఒకటికి రెండుసార్లు గెలుస్తారనే నిర్ధారణకు వచ్చాకే ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్లు ఇస్తారని కొంతమంది టీడీపీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రి ఇచ్చే గ్రేడింగ్‌లో పది పాయింట్లు వచ్చాయి కనుక వచ్చే ఎన్నికల్లో టికెట్‌ గ్యారంటీ అన్న నమ్మకంతో కొంతమంది నాయకులు ఉన్నారు.. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులనేమో సర్వే భయం వెంటాడుతోంది.. ఆ పార్టీకి  సలహాదారుగా ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే ఓ విడత సర్వే రిపోర్టును జగన్మోహన్‌రెడ్డికి అందించారట! ఆ పార్టీ తరఫున మరో బృందం కూడా రహస్యంగా సర్వే చేస్తోందట! సర్వే రిపోర్టులపై జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించాలని జగన్‌ అనుకున్నారట! అయితే అనుకోని కారణాల వల్ల ఆ భేటి వాయిదా పడిందని జిల్లా వైకాపా నాయకులు చెబుతున్నారు.
ప్రత్యేకహోదా.. విభజన హామీల అమలు.. కేంద్ర పథకాల అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? టీడీపీ నాయకుల విమర్శలను పార్టీ నాయకులు ఎలా తిప్పికొడుతున్నారు..? ఇలాంటి అంశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఓ సర్వే చేయించారట! ఆ సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికలలో టికెట్ల కేటాయింపు ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక జనసేనకు జిల్లాలో పెద్దగా క్యాడర్‌ లేదు..ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ నాయకులెవరూ ఆ పార్టీలో చేరలేదు.. ఒకట్రెండు నెలలలో పవన్‌కల్యాణ్‌ జిల్లాలో పర్యటించబోతున్నారు.. జనసేనలో చేరాలనుకుంటున్న తటస్థ నేతలపై పవన్‌ దృష్టి పెట్టారట! జనబలం కలిగిన నేతలు ఎవరున్నారో ఆరా తీస్తున్నారట! ఇందుకోసం జనసేనాని ఓ సర్వే చేయించారట!టీడీపీ…వైకాపా.. బీజేపీ.. జనసేనలు ఇప్పటికే ఓ విడత సర్వేలు చేయించిన విషయాన్నితెలుసుకున్న కాంగ్రెస్‌పార్టీ కూడా అప్రమత్తమయ్యిందట! త్వరలో రాహుల్‌గాంధీ పర్యటన ఉండటంతో హస్తంపార్టీ నేతలు చురుకుగా వ్యవహరిస్తున్నారు.. ప్రత్యేకహోదా.. రుణమాఫీ ప్రకటనలను జనం ఏ మేరకు విశ్వసిస్తున్నారు..? అధికార, ప్రతిపక్షపార్టీలపై ఏ మేరకు వ్యతిరేకత ఉంది..? ఇలాంటి విషయాలపై కాంగ్రెస్‌పార్టీ సర్వే చేయిస్తోంది.. సర్వే రిపోర్టులు తనకు  అనుకూలంగా ఉన్నాయని.. కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్‌ ఇవ్వడం గ్యారంటీ అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేసుకుంటున్నారు కొందరు.. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉందని.. ఈలోగా ఏమైనా జరగవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.. మొత్తంగా ప్రధాన రాజకీయపార్టీల సర్వేలతో నేతలు హడలిపోతున్నారు.. మరికొద్ది రోజుల్లోనే రెండో విడత సర్వేలు ప్రారంభం కాబోతున్నాయట! వీటిల్లో ఏమి తేలుతుందో చూడాలి..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.