రాజ‌కీయ వార‌సులొస్తున్నార‌హో…..

సంచలన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కర్నూలు జిల్లా రాజకీయం యువ నాయకత్వంతో కళకళలాడుతోంది. కేఈ శ్యామ్‌బాబు, కోట్ల రాఘవేంద్రారెడ్డి, టీజీ భరత్‌, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, బిజేంద్రనాథ్‌రెడ్డి అలియాస్‌ నాని, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి… అనే ఈ ఆరుగురు యువ నేతలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు ప్రజాక్షేత్రంలో తమ ముద్ర వేస్తున్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేతగా, రాజకీయ శాసనకర్తగా పేరుపొందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్‌బాబు. నైతిక విలువలకు నిలువటద్దంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పేరుపొందిన కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి. రాయలసీమ వాసుల మదిలో నిత్యం మెదిలే నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ కొడుకు టీజీ భరత్‌. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు బిజేంద్రనాథ్‌రెడ్డి. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి. ప్రస్తుతం ఈ ఆరుగురి పేర్లు జిల్లా రాజకీయాల్లో బాగా నలుగుతున్నాయి.
కేఈ శ్యామ్‌బాబు పత్తికొండ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. “ఇక నుంచి శ్యామ్‌బాబే పత్తికొండ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉంటాడు. 2019 ఎన్నికల్లో శ్యామ్‌బాబు తెలుగుదేశం తరఫున పోటీచేస్తాడు. నా కుమారుడిని ఆశీర్వదించండి” అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గతంలో పత్తికొండలో జరిగిన ఓ సమావేశంలో ప్రకటించారు. అప్పటినుంచి శ్యామ్‌బాబు పత్తికొండపై దృష్టి సారించారు. పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుతున్న క్రమంలోనే ఊహించని ఓ ఘటన జరిగింది. పత్తికొండ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు గురయ్యాడు. నారాయణరెడ్డి హత్య విషయంలో శ్యామ్‌బాబుపై కేసు నమోదయ్యింది. దీంతో అతని దూకుడుకి కొద్దికాలం బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్లీ ఆయన పుంజుకున్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు తండ్రి డిప్యూటీ సీఎం  కేఈ కృష్ణమూర్తి, మరోవైపు బాబాయ్ అయిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ సలహాలు, సూచనలతో  స్పీడ్ పెంచారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పత్తికొండ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా శ్యామ్‌బాబు గ్రాఫ్ మరింత పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే.. శ్యామ్‌బాబును గెలిపించాలనే తపనతో పత్తికొండ టీడీపీ క్యాడర్ పనిచేస్తోంది. 
శ్యామ్‌బాబు పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే పత్తికొండలో మరో పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెరపైకి వచ్చారు. “నా కుమారుడు రాఘవేంద్రారెడ్డి పత్తికొండ నుంచి రాజకీయ ప్రవేశం చేశాడు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పత్తికొండ అభ్యర్ధిగా పోటీచేస్తాడు” అని ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన కొద్దిరోజులు పత్తికొండలో చురుకుదనం పెంచిన రాఘవేంద్రారెడ్డి ఆ తర్వాత కొంత జోరు తగ్గించారు. దీంతో శ్యామ్‌బాబు హవాకి అడ్డులేకుండా పోయింది. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ కూడా తన సత్తా చాటుతున్నారు. ఓవైపు టీజీబీ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో- మరోవైపు రాజకీయాల్లో తన పాత్ర నిండుగా పోషిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్దిపాటి కాలంలోనే టీజీ భరత్ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. అయితే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికీ, టీజీ భరత్‌కీ కొద్ది రోజులపాటు కర్నూలు అసెంబ్లీ టిక్కెట్‌పై వివాదం నడిచింది. అయినప్పటికీ టీజీ భరత్ వెనక్కి తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకే ఖాయమని భావిస్తూ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. ప్రతిపక్ష నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు. ప్రత్యర్ధి వర్గాన్ని ఢీకొనేందుకు క్యాడర్‌ మొత్తాన్ని సిద్ధంచేస్తున్నారు. అటు నంద్యాల వైసీపీ నేత, మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తనయుడు రవిచంద్ర కిశోర్‌రెడ్డి, ఇటు ఆళ్లగడ్డ వైసీపీ నేత, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు బిజేంద్రనాథ్‌రెడ్డి తమ తండ్రుల అనుభవాలనే పాఠాలుగా చేసుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు.
నంద్యాల ఉపఎన్నికల్లో తన తండ్రి శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు కోసం రవిచంద్ర కిశోర్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. శిల్పా మోహన్‌రెడ్డి ఓడిపోయినప్పటికీ రవిచంద్ర ఏమాత్రం జంకలేదు. ఉపఎన్నికల తర్వాత శిల్పా వర్గాన్నంతా ఒక తాటిపైకి తీసుకొచ్చారు. వైసీపీ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అధికారపార్టీకి ధీటుగా దూసుకెళ్తున్నారు. మరోవైపు శిల్పా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేపడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ తనకే టిక్కెట్ ఇస్తాడన్న ఆశాభావంతో రవిచంద్ర ఉన్నట్లుగా సమాచారం. 
ఇక ఆళ్లగడ్డ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడు బిజేంద్రనాథ్‌రెడ్డి గత నాలుగేళ్లుగా ఆళ్లగడ్డ రాజకీయాల్లో కలియదిరుగుతున్నారు. వైసీపీలోకి చేరిన తర్వాత పార్టీ శ్రేణులను తనవైపుకు తిప్పుకున్నారు. మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు. ఇటీవల ఆళ్లగడ్డలో వైఎస్‌ జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేయడంలో సక్సెస్‌ అయ్యారు. తద్వారా జగన్ మదిలో బిజేంద్రనాథ్‌రెడ్డి స్థానం సంపాదించుకున్నారు. మంత్రి భూమా అఖిలప్రియ వర్గం బలమైనదైనప్పటికీ, 2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ సంపాదించి, గెలుపే లక్ష్యంగా దూసుకుపోవాలని బిజేంద్రనాథ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆళ్లగడ్డ రాజకీయాల్లో తన ముద్ర వేస్తున్నారు.  నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా 2014 ఎన్నికల ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సాయి ఈశ్వరుడి హత్య కేసులో సిద్ధార్థరెడ్డి ముద్దాయిగా ఉండటంతో కొంతకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలే ఫలించకపోవడంతో ఒంటరిగానే నందికొట్కూరు రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రఘురామిరెడ్డిపై దాడి చేయించాడనే ఆరోపణలపై సిద్ధార్థరెడ్డి మరో కేసులో ఇరుక్కున్నాడు. ప్రత్యర్థి వర్గాల నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయన మాత్రం నందికొట్కూరు రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదంటున్నారు. మెల్లమెల్లగా ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. మొత్తానికి అనేక సవాళ్ల మధ్య ఈ ఆరుగురు యువ నాయకులు రాజకీయ వారసులుగా ఆరంగ్రేటం చేసి తమ సత్తా చాటుతున్నారు. చూద్దాం వచ్చే ఎన్నికల నాటికి ఎవరి భవతవ్యం ఎలా ఉంటుందో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.