వారసత్వ రాజకీయాల జోరు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఫ్యామిలీ ప్యాకేజీల కోసం రాజకీయ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు అధిష్టానాలకు ఇదే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తాము పోటీచేయడమే కాకుండా తమ కుమారులకు – కూతుళ్లకు – బాబాయ్‌ – అబ్బాయ్‌ లకు కూడా టికెట్స్‌ డిమాండ్‌ చేస్తూ అధిష్టానాలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. బలమైన నేతలందరూ తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన అల్లుడు రాంనగర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డికి ముషీరాబాద్‌ అసెంబ్లీ సీటును కోరుతున్నారు. అలాగే మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి ఈసారి తనకున్న ప్రాబల్యంతో సోదరుడు నరేందర్‌ రెడ్డికి టికెట్‌ ఇప్పించుకున్నాడు. ఆయన ఏకంగా కోడంగల్‌ లో టీఆర్‌ఎస్‌ కు కొరకరాని కొయ్యగా మారిన బలమైన రేవంత్‌ రెడ్డిపై బరిలోకి దిగుతున్నాడు. ఆర్థిక అసమాన ప్రజాబలంతో రేవంత్‌ ను ఢీకొట్టడానికి మహేందర్‌ రెడ్డి పావులు కదుపుతున్నాడట.. ఈ మేరకు తనకున్న బలంతో రేవంత్‌ ను ఓడిస్తామని కేసీఆర్‌ కు హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక 2014 ఎన్నికల్లో కుమారుడి కోసం సీటు త్యాగం చేసిన సబితా ఇంద్రారెడ్డి ఈసారి శాసనసభ బరిలో దిగడానికి రెడీ అవుతోందట.. మహేశ్వరం నుంచి సబిత – రాజేందన్రగర్‌ నుంచి ఆమె కొడుకు కార్తీక్‌ రెడ్డి పోటీచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీడీపీ సీనియర్‌ నేత దేవేందర్‌ గౌడ్‌ చాలా రోజుల తర్వాత శాసనసభ బరిలోకి దిగుతున్నాడు. ఆయన మహేశ్వరం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నాడు. ఇక ఆయన కుమారుడు వీరేందర్‌ గౌడ్‌ ఉప్పల్‌ నుంచి పోటీచేయాలని డిసైడ్‌ అయ్యాడు. 
మహాకూటమిలో కాంగ్రెస్‌ తో పొత్తు కుదిరితే టీడీపీ తరఫున వీళ్లిద్దరికీ కోరిన టికెట్స్‌ వస్తాయా రావా అన్నది తేలాల్సి ఉంది. ఇక చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాలని మాజీ జడ్పీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ రెడీ అయ్యారు. అలాగే తన సోదరుడి కుమారుడు వీరేష్‌ కు కూడా కుత్బుల్లాపూర్‌ నుంచి టీడీపీ తరఫున పోటీచేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రిశశిధర్‌ రెడ్డి ఈసారి కూడా సనత్‌ నగర్‌ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన కుమారుడు ఆదిత్య మాత్రం కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇటీవలే కోదండరాం తెలంగాణ జనసమితిలో చేరారు. ఆయన తన తాత మర్రి చెన్నారెడ్డి పోటీచేసిన తాండూర్‌ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. టీజేఎస్‌-కాంగ్రెస్‌ పొత్తులో తాండూర్‌ సీటును ఆదిత్య కోరే అవకాశం ఉంది. ఇక పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌ రెడ్డి వౄఎద్ధాప్యం – అనారోగ్య కారణాలతో తప్పుకొని తన కుమారుడు మహేష్‌ రెడ్డిని పోటీకి దింపాడు. మహేష్‌ కు టీఆర్‌ ఎస్‌ పరిగి సీటును ఇప్పించుకోగలిగారు. ఇలా వారసుల కోసం సీనియర్ల లాబీయింగ్‌ – త్యాగాలతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.