ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో వార‌సుల తాకిడి

ఏపీలో రాబోయే ఎన్నిక‌ల్లో వార‌సుల తాకిడి అధికంగా క‌నిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ , టీడీపీలో వారసుల ఎంట్రీ ఎక్కువగా ఉన్నట్టు స‌మాచారం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు మంత్రి కళా వెంకటరావు, మాజీ మంత్రులు ధర్మాన, తమ్మినేని సీతారాంల కొడుకులు ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ కోసం వేగం పెంచిన‌ట్టు తెలుస్తోంది అలాగే ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట కుమారులు కూడా రంగం సిద్దంచేసుకుంటున్నార‌ని స‌మాచారం. పలాస ఎమ్మెల్యే శివాజీ స్థానంలో తనయురాలు శిరీష, ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ, ధర్మాన కృష్ణదాస్‌ తనయుడు కృష్ణచైతన్య కూడా రాజ‌కీయ వ్యూహాల‌తో ముందుకు సాగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వైసీపీ పార్టమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉండడంతో ఆయన తనయుడు చిరంజీవి నాగ్‌ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ రాజకీయ వారసురాలిగా అత‌ని కుమార్తె గౌతు శిరీష రంగంలోకి దిగుతారని ప్రచారం జ‌రుగుతోంది. ఆమె ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు నియోజకవర్గం లోనూ విస్తృతంగా పర్యటిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే రాజాం నియోజకవర్గంలో సీనియర్‌ నాయకురాలు కావలి ప్రతిభా భారతి తనయురాలు గ్రీష్మ కూడా నియోజకవర్గంలో పట్టు పెంచుక‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. నరసన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తనయుడు బగ్గు సునీల్‌ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ కుమారుడు కృష్ణచైతన్య తండ్రికి మద్దతుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నార‌ని తెలుస్తోంది. అలాగే పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తనయుడు సాగర్‌ గత కొంతకాలం నుంచి వారసుడిగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నార‌ని భోగ‌ట్టా. ఇలా రాజ‌కీయ నేత‌ల వార‌సులంతా రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి వీరిలో ఎవ‌రు విజేత‌లుగా మిగులుతారో, ఎవ‌రు ప‌రాజితుల‌వుతారో కాల‌మే చెప్పాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.