విస్తరణతో ముడిపడిన రాజకీయ సమీకరణలు?

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించిన నేపధ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. బీజేపీకి చెందిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామాలతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు, విస్తరణకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జిల్లాకు చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను అధినేత చంద్రబాబు అప్పగించిన విషయం విదితమే. వెనువెంటనే హోంమంత్రిగా కూడా నియమించారు. అలాగే జిల్లాకు చెందిన మరో కీలక నేత, బీసీ సామాజికవర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కాగా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో అప్పట్లో జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తూర్పు గోదావరి జిల్లా నుండి విధిగా ఓ దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి లభిస్తూ వచ్చింది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అవకాశం పశ్చిమ గోదావరి జిల్లాకు లభించడంతో జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది.
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మంత్రి పదవిపై మెండుగా ఆశలు పెట్టుకున్నారని సమాచారం. అలాగే కాపు సామాజికవర్గానికి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణంటూ జరిగితే తన పేరును తప్పక పరిశీలిస్తారన్న నమ్మకంతో నెహ్రూ ఉన్నట్టు భోగట్టా. మరోవైపు వైకాపా నుండి తెలుగుదేశంలో చేరిన నెహ్రూకు గతంలో మంత్రి పదవిని ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి పదవి అంటూ కాపులకు ఇవ్వాల్సి వస్తే తన పేరే పరిశీలించాలని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా మంత్రి వర్గంలో తనకు చోటు లభించని పక్షంలో 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేయాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకునేందుకు సైతం తోట సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేల్లోనూ మంత్రి పదవిపై ఆశలు చిగురిస్తున్నాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మరి ఇంతమంది మంత్రి పదవులు ఆశిస్తున్న నేపధ్యంలో చంద్రబాబు ఎవరిని కరుణిస్తారో తెలియాల్సివుంది. అయితే మంత్రి పదవి దక్కనివారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సివుంది. ఏదిఏమైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ అనంతరం టీడీపీలో మరోమారు రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.