పితానితో పిత‌లాట‌కం లేనట్లేనా?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన కీల‌క రాజ‌కీయ నేత‌ పితాని స‌త్య‌నారాయ‌ణ‌. బీసీ వ‌ర్గానికి చెందిన ఆయన మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. వైఎస్‌కు అత్యంత ఆప్తుడిగా కూడా గుర్తింపుపొందారు. 2004 ఎన్నిక‌ల్లో ర‌ద్ద‌యిన పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌. కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పి, చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు టీడీపీలో చేరారు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఆచంట టికెట్‌ను కేటాయించారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ముదునూరి ప్ర‌సాద్ రాజుపై విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆయనను కార్మిక శాఖ మంత్రిగా నియ‌మించారు. దీనికితోడు అధికార ప్ర‌తినిధిగా కూడా అవ‌కాశం క‌ల్పించారు. అయితే, ఇటీవ‌ల కొన్నాళ్లుగా పితానిపై కొన్ని ఆరోపణలు వ‌స్తున్నాయి. ఆయ‌నకు టీడీపీలో తనకు గుర్తింపు లేకుండా పోయిందని భావిస్తూ వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయ‌న‌కు వైసీపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. ఈ వాదనకు బ‌లం చేకూరుస్తూ.. ఆయ‌న ఏనాడూ వైసీపీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌లేదని వాదన వినిపిస్తోంది. మరోవైపు రాబోయే ఎన్నిక‌ల నాటికి పితాని స‌త్య‌నారాయ‌ణ.. జ‌న‌సేనలో చేరుతారని కూడా అంటున్నారు. అయితే, ఇటువంటి వ్యాఖ్యలను అప్ప‌ట్లోనే  పితాని ఖండించారు. త‌న‌కు ప‌వ‌న్ ఎవ‌రో తెలియ‌ద‌ని కూడా వ్యాఖ్యానించడం విశేషం. ఈ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా కూడా మారాయి.
అయితే, తాజాగా త‌న అనుచ‌రుల‌తో భేటీ అయిన పితాని.. రాబోయే ఎన్నిక‌ల్లోనూ తాను టీడీపీ నుంచే పోటీ చేస్తాన‌ని, ఈ విష‌యంలో సందేహాలు అవ‌స‌రం లేద‌ని స్పష్టం చేశారు. త‌న‌ను చంద్ర‌బాబు స్వయంగా పార్టీలో చేర్చుకున్నార‌ని, కేబినెట్ సీటు కూడా ఇవ్వడంతో మరో పార్టీవైపు ఎందుకు చూస్తానని ఆయన తిరిగి ప్రశ్నిస్తున్నారట! కాగా ఆచంట‌లో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ ఆయ‌న గెలుపు త‌థ్యమని తెలుస్తోంది.  ఇటువంటి సమయంలో ఆయ‌న పార్టీ ఎందుకు మార‌తారనే ప్రశ్నకూడా సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఆయ‌నను  ఎలాగోలా త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు విప‌క్షాలు చేస్తోన్న ఈ ప్ర‌చారాన్ని పితానితో పాటు ఆయ‌న అనుచ‌రులు కూడా తిప్పికొడుతున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.