రాజ‌కీయాల్లోనూ అత‌నివి… కామ‌ర్స్ లో ఫిజిక్స్ ఐడియాలు!

టీడీపీ నేత జలీల్ ఖాన్ బీకామ్‌లో ఫిజిక్స్ చ‌దివాన‌ని చెప్పి గ‌తంలో న‌వ్వులపాల‌యిన విష‌యం విదిత‌మే! ఈ ఒక్క విష‌యంలోనే కాదు ఆయ‌న ఆలోచ‌న‌లు, చేత‌లు అన్నీకామ‌ర్స్ లో ఫిజిక్స్ లాంటివేన‌నే వ్యాఖ్యానాలు టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తుండ‌టం విశేషం. అంతేకాదు.. లౌక్యం ప్రదర్శించడం, మర్మగర్భంగా మాట్లాడడంలో ఆయనకు ఆయ‌నేసాటి అనిపించేలా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ట‌! తాజాగా ఆయన జగన్‌ను, బీజేపీని తిట్టడంలో దూకుడు పెంచారు.  వైఎఎస్ ఆర్ సీపీ అధినేత జ‌గ‌న్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు వద్ద మార్కులు కొట్టే ప్రయత్నంలో జ‌లీల్ ఉన్నార‌ని పార్టీలోని వారే అంటున్నారు. అందులో భాగంగానే  ఓ ప్రకటన కూడా చేశారు.  చంద్రబాబు అనుమతిస్తే తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా, తన కుమార్తె… వైసీపీ అధినేత జగన్‌పైన పోటీ చేస్తామని వివ‌రించారు.  ఇది విన్నవారంతా పార్టీ కోసం జలీల్ ఖాన్ కుటుంబం ఎంత‌టి త్యాగానికైనా సిద్ధపడుతున్న‌ద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే ఆయన గురించి బాగా తెలిసినవారు ఆయ‌న నైజంలోని  లోగుట్టు వెల్ల‌డిస్తున్నారు. తనతో పాటు తన కుమార్తెకు కూడా టిక్కెట్ కావాలని చంద్రబాబును అడగడమే ఆయ‌న ఉద్దేశ‌మ‌ని చెబుతున్నారు.  దీనికితోడు కన్నాపై తాను పోటీ చేస్తే గెలుపు బాధ్యత పార్టీయే చూసుకోవాల్సి వ‌స్తుందనే ఆలోచ‌న ఆయ‌న‌లో ఉంది. ఇదిలావుండ‌గా బీజేపీతో వ్యవహారం చెడడంతో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఓడించి, ఆ పార్టీ ఆత్మ స్థైర్యం దెబ్బతీయాల‌ని టీడీపీ గ‌ట్టిగా అనుకుంటోంది.. ఈ నేప‌ధ్యంలో  క‌న్నాపై జలీల్ పోటీ చేయాల్సి వ‌స్తే… గెలుపు బాధ్య‌త‌ చంద్రబాబే తీసుకోవ‌ల్సి వ‌స్తుంది. ఇక జగన్‌పై పోటీ అంటే అది  పెద్ద స‌వాలే! అయితే కుమార్తెకు టిక్కెట్ ఇప్పించి.. జగన్‌పైనే పోటీ చేయించి… చివ‌రికి సానుభూతి పొందాలనేది జ‌లీల్ ఖాన్ యోచ‌న అని విశ్లేష‌కులు అంటున్నారు.  ఏదో రకంగా కుమార్తెను ఎన్నికల బరిలోకి తేవడం ఆయ‌న ముందున్న ప్ర‌ణాళిక అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్ పై పోటీ చేసి పాపులారిటీ తెచ్చుకోవ‌టం ఆయ‌న‌ రెండో లక్ష్యమని తెలుస్తోంది. ఈ విధంగా  చంద్రబాబు వద్ద సానుభూతి పొందితే భ‌విష్య‌త్ లో ఇతర పదవులేవైనా ద‌క్క‌వ‌చ్చ‌నే భావ‌న‌తో ఆయ‌న ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.