‘పేట’ మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: క‌ళానిధి మార‌న్‌

విడుద‌ల‌: అశోక్ వ‌ల్ల‌భ‌నేని

బ్యాన‌ర్‌: స‌న్ పిక్చ‌ర్స్‌

న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ సేతుప‌తి, న‌వాజుద్దీన్ సిద్ధికీ, శ‌శికుమార్‌, బాబీ సింహ‌, త్రిష‌, సిమ్రాన్‌, మేఘా ఆకాశ్‌, మహేంద్ర‌న్ త‌దిత‌రులు.

సంగీతం: అనిరుధ్‌

ఛాయాగ్ర‌హ‌ణం: తిరు

కూర్పు: వివేక్ హ‌ర్ష‌న్‌

నిర్మాణం: స‌న్ పిక్చ‌ర్స్‌

ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బ‌రాజ్‌

దక్షిణాదిలోని అన్ని భాషల్లో రజనీకాంత్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. త‌న‌దైన‌ స్టైల్‌, మేన‌రిజంతో క‌ట్టిప‌డేస్తారు. ఆయ‌న సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తారు. త‌మిళ‌నాడులో అయితే అక్క‌డి వారికి త‌లైవా సినిమా ఒక పెద్ద పండగే. ఇంచుమించుగా తెలుగులోనూ అదే పరిస్థితి. అయితే  గ‌త ఏడాది `2.0`తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన ర‌జ‌నీకాంత్‌.. మూడు నెల‌ల్లోనే `పేట` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కార్తీక్ సుబ్బ‌రాజ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ పేట సినిమా ఎలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది? తన అభిమాన హీరోని  కార్తిక్ సుబ్బరాజ్ ఎలా ప్రెజెంట్ చేశాడో చూద్దామా.. 

క‌థ

కాళీ(ర‌జ‌నీకాంత్‌) ఒక కాలేజ్‌లో హాస్ట‌ల్ వార్డెన్‌గా చేర‌తాడు. అక్క‌డ చోటు చేసుకునే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన స్టైల్‌లో పరిష్కరిస్తుంటాడు. ఒక ప్రేమ జంట‌ను కూడా క‌లుపుతాడు.  అక్క‌డ మైకేల్‌( బాబీ సింహ‌) అండ్ గ్యాంగ్ జూనియ‌ర్స్‌ను ఇబ్బంది పెడుతుంటే వారిని అడ్డుకుంటాడు. అందువ‌ల్ల మైకేల్ తండ్రి, లోక‌ల్ డాన్‌తో పెద్ద గొడ‌వ అవుతుంది. అదే స‌మ‌యంలో అన్వ‌ర్ అనే కుర్రాడి ప్రేమ మేఘా ఆకాశ్‌తో స‌క్సెస్ కావడానికి ఆమె త‌ల్లి మంగ‌ళ‌(సిమ్రాన్‌)తో మాట్లాడుతాడు. అప్పుడే అత‌ని పేరు కాళీ కాదు… పేట అని, అత‌డిది ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ అని తెలుస్తుంది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సింహాచ‌లం(న‌వాజుద్దీన్‌) అనే రాజ‌కీయ పెద్ద నాయ‌కుడితో విభేదాలు ఉంటాయి. అవి ఏంటి? అస‌లు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ నుంచి పేట ఎందుకు వ‌చ్చాడు? మ‌ళ్లీ అక్క‌డ‌కు వెళ్లాడా?  వెళ్లి ఏం చేశాడ‌న్న‌ది క‌థ‌. 

సినిమా ఎలా ఉందంటే

ఫుల్ ఎన‌ర్జీతో రజినీకాంత్ ఈ సినిమాలో నటించారు. చాలా కాలం త‌ర్వాత ర‌జ‌నీ త‌న స్టైల్‌ను చూపించుకోవ‌డానికి, త‌న ఛ‌రిష్మా చూపించుకోవ‌డానికి ఇలాంటి క‌థ‌ను ఎంచుకున్నాడ‌నిపిస్తోంది. అలాగే ఆయ‌న గ‌త చిత్రాల‌తో పోల్చితే వ‌య‌సును మించి క‌ష్ట‌ప‌డి డ్యాన్సులు కూడా వేశారు. ఇక కామెడీ టైమింగ్‌లో ర‌జనీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్‌, సిమ్రాన్ ట్రాక్ మెప్పిస్తుంది. న‌వ‌త‌రం ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల్లో కార్తీక్ సుబ్బ‌రాజు ఒక‌డు. త‌న క‌థ‌ల్లో చిన్న గ‌మ్మ‌త్తు ఉంటుంది. కాక‌పోతే అత‌ను కూడా ర‌జ‌నీ స్టైల్‌ను ఫాలో అయిపోతూ, ర‌జ‌నీ సినిమాకు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. తొలి స‌న్నివేశాలు, ర‌జ‌నీ ప‌రిచ‌య దృశ్యాలు, హాస్ట‌ల్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు ఇవ‌న్నీ కేవ‌లం ర‌జ‌నీ అభిమానుల‌ను మెప్పించ‌డానికే! ఈ స‌న్నివేశాల‌న్నీ, ఒక ‘న‌ర‌సింహ’, ‘ముత్తు’, ‘అరుణాచ‌లం’ చిత్రాల్లోని ర‌జ‌నీని త‌ల‌పిస్తాయి. పోరాట స‌న్నివేశాలు కూడా అలాగే స్టైల్‌గా తీశాడు. విరామ స‌న్నివేశాల వ‌ర‌కూ ఇసుమంత క‌థ కూడా ద‌ర్శ‌కుడు చెప్ప‌లేదు. కేవ‌లం ర‌జ‌నీ అభిమానుల‌ను మెప్పించ‌డానికే స‌న్నివేశాల‌ను అల్లుకుంటూ వెళ్లాడు. ఇక ద్వితీయార్ధంలో ఒక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని, అదే పేట.. కాళీగా మార‌డానికి కార‌ణ‌మై ఉంటుంద‌ని అభిమానులు న‌మ్ముతారు. కానీ, ద్వితీయార్ధం కూడా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ స‌న్నివేశాల‌తో న‌డిపించాడు. మొత్తంగా  చూస్తే ఇదో రివేంజ్ డ్రామా. ఇటీవ‌ల కాలంలో ర‌జ‌నీని ర‌జ‌నీలా చూడ‌లేక‌పోయామ‌ని నిరాశ ప‌డుతున్న అభిమానుల‌కు మాత్రం ఇది ఫుల్‌మీల్స్‌ లాంటిదని చెప్పుకోవచ్చు.

నటీనటుల పనితీరు

సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది ర‌జ‌నీకాంత్ గురించి.. ఫుల్ ఎన‌ర్జీతో ఈ సినిమాలో న‌టించారు. డ్యాన్సులు ఇరగదీశాడు. ర‌జ‌నీకాంత్‌, సిమ్రాన్ ట్రాక్ మెప్పిస్తుంది. ఇక సినిమాలో భారీ తారాగ‌ణం ఉంది. న‌వాజుద్దీన్ సిద్ధికీ న‌టించిన తొలి సౌతిండియా మూవీ. సింఘా అలియాస్ సింహాచ‌లం పాత్ర‌లో ఆయ‌న అద్భుతంగా న‌టించారు. ఇక బ్యాడ్ స్టూడెంట్ లీడ‌ర్‌గా బాబీ సింహ పాత్ర ప‌రిమితంగానే ఉంటుంది. ఇక చెప్పుకోవాల్సింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన గుండా జిత్తులాగా విజ‌య్ సేతుప‌తి న‌టించాడు. ఇక త‌న న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎక్స్‌ట్రార్డినరీ రోల్ ప్లే చేశాడు. ఇక హీరో స్నేహితుడు పాత్ర‌లో న‌టించిన శ‌శికుమార్ పాత్ర‌కు న్యాయం చేశాడు. ఇక త్రిష‌, సిమ్రాన్‌, మేఘా ఆకాశ్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

టెక్నీషియన్ల పనితీరు

కార్తీక్ సుబ్బ‌రాజ్.. రజినీ స‌్టైల్‌ ని బేస్ చేసుకుని ఓ అభిమానిగా త‌న హీరోను డైరెక్ట్ చేశాడు.  క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాను తెర‌కెక్కించాడు.  అనిరుధ్ పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను పెంచాయి. తిరు కెమెరా ప‌నిత‌నం బావుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి.

బలాలు

* ర‌జ‌నీ స్టైల్‌

* ఫస్టాఫ్ స‌న్నివేశాలు

* సిమ్ర‌న్‌, ర‌జ‌నీ ట్రాక్‌

* సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌

బలహీనతలు

* క‌థా, క‌థ‌నం

* ద్వితీయార్ధం సాగతీత

మొత్తంగా: పేట‌.. పండుగ వేళ ర‌జ‌నీకాంత్ వినోదం 

రేటింగ్: 3.25/ 5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.