2014లోమోదీకి బ్ర‌హ్మ‌ర‌థం….2019లో….?

2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీకి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు జనసేన మద్దతుతో పోటీ చేశాయి.. నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీపై రాష్ట్ర ప్రజలు గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. నాలుగేళ్లు గడిచినా చట్టంలో పెట్టిన విద్యాసంస్థలు ఇవ్వడం మినహా ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన మిగతా అంశాలపై కాలయాపన చేసిన బీజేపీపై రాష్ట్ర ప్రజలు కసి పెంచుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ప్రజలలో ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ప్రత్యేకహోదా సెంటిమెంట్‌గా మారడం… తెలుగుదేశంపార్టీ ఎన్డీయే నుంచి వైదొలగడం… ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై విరుచుకుపడటం వంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. చేసినవి చెప్పుకున్నా కూడా వినే పరిస్థితులలో ప్రజలు లేకపోవడంతో బీజేపీకి ఇబ్బందిగా మారింది.  కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చగా… తాము బిడ్డను.. తల్లిని ఇద్దరినీ బతికిస్తామని చెప్పిన బీజేపీ నమ్మించి మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల బీజేపీ నేత ఒకరు ఢిల్లీలో హైకమాండ్‌ దగ్గర తన ఆవేదనను వ్యక్తం చేశారు. మేము చెప్పినా వినిపించుకునే దశలో ప్రజలు లేరని ఆయన హైకమాండ్‌కు వివరించారు. నాలుగు నెలలలో పరిస్థితులన్నీ మారిపోతాయని.. తాము చెప్పినట్లు నడుచుకోవాలని హైకమాండ్‌ ఆయనకు అభయం ఇచ్చింది. తెలుగుదేశంపార్టీ ఎన్డీయేలో ఉన్నంత వరకు పదే పదే చంద్రబాబుపై ఆరోపణలు చేసిన కమలంలోని కాంగ్రెస్‌ బ్యాచ్‌ ప్రస్తుతం ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో చిక్కుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితులను చంద్రబాబు సృష్టించారని కాషాయదళ నేతలే అంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని పోటీ చేయాలనుకున్నా ఆ విషయాన్ని టీడీపీ బయటపెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన విద్యాసంస్థలు.. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు.. ఇతర అంశాలపై తాము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా.. వినేందుకు వారు సిద్ధంగా లేరని బీజేపీలోని ఓ కీలకనేత చెప్పారు.
తెలుగుదేశంపార్టీ కటిఫ్‌ చెబితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలలో పోటీచేయవచ్చని భావించిన బీజేపీలోని కొందరు నేతల ఆశలు ఆడియాశలు అయ్యాయి. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్‌ గరుడ పేరిట సినీ హీరో శివాజీ బయటపెట్టిన వ్యూహం కూడా బీజేపీని నైతికంగా దెబ్బతీసింది. శివాజీ వివరణ ప్రజలలోకి బలంగా వెళ్లింది. శివాజీ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని భావిస్తున్న బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్పాలనీ.. వామపక్షాలతో పాటు టీడీపీ కూడా గొంతు కలపడంతో ప్రజలలో కమలం పార్టీపై మరింత కసి పెరిగింది. సంస్థాగతంగా బలంగా లేని బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో ముందు నుయ్యి .. వెనుక గొయ్యి అన్న చందంగా తయారయ్యింది.. ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాలను అమలు చేయలేక.. రాష్ట్రంలో ప్రజలకు నచ్చ చెప్పలేక వారు సతమతమవుతున్నారు. నిన్నటి వరకు ఢిల్లీలో హైకమాండ్‌లోని పెద్దల దగ్గర చంద్రబాబుపై పదేపదే చాడీలు చెబుతూ .. చెవిలో ఇల్లుకట్టుకుని పోరిన కమలంలోని కాంగ్రెస్‌ బ్యాచ్‌ ప్రస్తుతానికి సైలెంట్‌ అయ్యింది. అడపాదడపా స్టేట్‌మెంట్లు మినహా ఎక్కడా ప్రజలలో కనిపించడం లేదు. ఒంటరితనంతో రాజకీయంగా అంటరానివారుగా మారామని బీజేపీ కీలక నేత ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. తమను అంటరానివారుగా చేయడంలో చంద్రబాబు విజయం సాధించారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో తమకు ఒక్క సీటు కూడా రాదని హైకమాండ్‌కు తెలుసని అన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా ప్రత్యేక ప్యాకేజీ కింద అన్ని రకాలుగా సాయం చేసి ఉంటే.. ఈ రోజున ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఏపీ ప్రజల దృష్టిలో తమను హైకమాండ్‌ దోషిగా నిలబెట్టిందని ఆవేదన చెందారాయన!

2 Comments

  1. Congress killed all his men in 2014 and now BJP lost golden chance at least in future they would have made strong presence had they helped AP & fulfilled all promises. Now BJP made self goal. Both national parties lost in AP

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.