ముందుకు నడుస్తూ ‘వెనక్కి’ చూస్తున్న పవన్?

సుడిగాలి పర్యటనలతో బిజీగా వున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు మాత్రమే కేటాయిస్తానని గతంలో ప్రకటించారు. జనం కూడా దానినే నమ్మారు. అయితే ఇప్పుడు దీనిలో సవరణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోఎన్నికలకు మరో ఆర్నెల్లు గ్యాప్ వుంది. ఈలోగా ఏదైనా సినిమాలో చేసేందుకు పవర్ స్టార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాలకు ప్లస్ అయ్యేవిధంగా ఏదైనా సోషియోపొలిటికల్ క్యారెక్టర్ దొరికితే సినిమా చేయాలని పవన్ భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. ఎన్టీయార్ బయోపిక్‌తో టీడీపీ, వైఎస్ బయోపిక్‌తో వైసీపీ లబ్ది పొందబోతున్న క్రమంలో జనసేన సైతం అటువంటిదే ఒక ఎక్స్‌పరిమెంట్ ప్లాన్ చేస్తోందని వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చివరగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం అభిమానులని నిరాశ పరిచింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా మారిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ పర్యటనలు కొనసాగుతున్నాయి. పవన్ సన్నిహిత వర్గాల నుంచి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆ లోపు మరో చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై పవన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారట.
సన్నిహితులతో, పార్టీ నేతలతో కూడా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఓ చిత్రం విడుదల చేస్తే ప్రచారానికి ఊపు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో పవన్ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయంకూ ఉంది. పవన్ కళ్యాణ్ నిర్మాతగా కూడా త్వరలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. వైష్ణవ్ లాంచ్ మూవీని పవన్ నిర్మించాలని భావిస్తున్నట్లు భోగట్టా. ఇది కనుక జరిగితే వైష్ణవ్ తొలి చిత్రానికి మంచి స్టేజి దొరికినట్లే. ఈ చిత్రానికి కాటమరాయుడు డైరెక్టర్ డాలి పేరు వినిపిస్తోంది. అయితే. ఈ వార్తలన్నిటి మీద స్పష్టమైన సమాచారమేదీ లేదు. జనసేన నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి పాలిటిక్స్ తప్ప మరే అంశం జోలికి పోవడం లేదని చెబుతున్నాయి. ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ చేయాలంటే షూట్ కోసం నెలల తరబడి సమయం వెచ్చించాలని, రాజకీయాల మీద ఏకాగ్రత తప్పుతుందని పవన్ భావిస్తున్నారట! ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మరి!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.