పవన్ అప్పుడు అలా జగన్‌కు సహకరిస్తారట?

ఆంధ్రప్రదేశ్‌లో త్రిశంకు సభ ఏర్పాటైతే పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? తెలుగుదేశం, వైసీపీల్లో ఎవరివైపు మొగ్గుచూపుతారనే విషయం  చర్చనీయాంశంగా మారింది. గతంలో పవన్ టీడీపీకి సహకరించడంతోనే పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం సీట్లు ఆ పార్టీ దక్కించుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి నాలిగింట మూడొంతుల సీట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన సొంతంగా పోటీ చేయగల స్థానాలు రాష్ట్రంలో నలభైవరకూ మాత్రమే ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మరో 70 సీట్లలో 3నుంచి 5వేల వరకూ ఓట్లు తెచ్చుకునే బలం ఉన్నట్లుగా రాజకీయపరిశీలకుల అంచనా వేస్తున్నారు. ఈ సీట్లలో ఓటు బదలాయింపు చేయగలిగితే టీడీపీ, వైసీపీల్లో ఏదో ఒక పార్టీ గెలుపును శాసిస్తుందని వారంటున్నారు. ఏ పార్టీతోనూ నేరుగా పొత్తు పెట్టుకోకుండా, పరోక్షంగా సహకరించడం ద్వారా భవిష్యత్తులో సంకీర్ణానికి బాటలు వేసుకునే దిశలో పావులు కదపడం మంచిదని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయని భోగట్టా! 2014లో పవన్ ఎలాగూ తెలుగుదేశానికి సహకారం అందించారు. ఈసారి వైసీపీకి సహకరించడం మేలని నిపుణుల నుంచి సూచనలు ఆ పార్టీకి అందుతున్నాయని తెలుస్తోంది. అయితే జగన్ స్వయంగా పవన్‌పై వ్యక్తిగత ప్రకటనలు చేయకుండా ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవంటున్నారు. అప్పుడు వైసీపీ వైపే జనసేనాని మొగ్గు చూపే పరిస్థితులు నెలకొని ఉండేవంటున్నారు.
కాగా తూర్పు, పశ్చిగోదావరి జిల్లాలు జనసేనకు కీలకంగా ఉన్నాయి. అప్పట్లో ప్రజారాజ్యానికి ఆయువు పట్టుగా ఈ జల్లాలు నిలిచాయనేది విదితమే. ఇక్కడే చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారు. అయినప్పటికీ కులపరమైన సమీకరణలే ఈ జిల్లాలో కీలకంగా ఉంటూవస్తున్నాయి. టీడీపీకి లభించిన ఓట్లలో మూడోవంతు ఇక్కడి నుంచే వచ్చాయి. గెలిచిన స్థానాలూఅధికంగా అక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు జనసేన విషయంలో ఈ లెక్కలు వర్క్ అవుట్ కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా మరోవైపు ఇక్కడ గతంలో కన్నా టీడీపీ బాగా బలపడిందని తెలుస్తోంది. అలాగే జగన్ పాదయాత్ర ఈ జిల్లాల్లో విజయవంతమైంది. ఈ నేపథ్యంలో గతంలో ప్రజారాజ్యానికి ఉన్నంత పట్టు ప్రస్తుతం జనసేనకు ఉంటుందా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. మరోవైపు పవన్ కు యువతలో క్రేజ్ ఉన్న మాట విదితమే. అయితే వారంతా ఆ పార్టీకే ఓట్లు వేస్తారని ఎవరూ చెప్పలేరు. దీనికి గతంలో ప్రజారాజ్యం కొంతమేరకు వారి నమ్మకాన్ని దెబ్బతీసిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ రాజకీయ స్థిరత్వంపైనా ఓటర్లలో ఇంకా అనుకున్న మేర విశ్వాసం ఏర్పడలేదని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఏతావాతాచూస్తే పవన్ రాజకీయ భవితవ్యం గురించి ఎవరూ ఇతమిద్దంగా ఇప్పుడే చెప్పలేకపోతున్నారనేది వాస్తవం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.