కాపులను పిలిచి పీటవేస్తున్న పవన్?

ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీలో చేరేవారిలో ముందుగా కాపులకే జనసేన అధినేత పవన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతలు జనసేనవైపు ఆసక్తిగా చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ముందుగా పవన్ కాపు నేతలను ఎంపిక చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు పవన్ పార్టీలో చేరుతున్నవారిలో, జనసేన వేదికల మీదా అత్యధికశాతం కాపులే కనిపిస్తున్నారని తెలుస్తోంది. కాకినాడకు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణను స్వయంగా పవనే ఆహ్వానించి జనసేనలో చేర్చుకున్న విషయం విదితమే. ఆయనతో పాటు టీడీపీ కార్పొరేటర్ శేషుకుమారి, కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బల్లబ్బాయిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావు, అలియాస్ నానాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగిశెట్టి అశోక్ జనసేనలో చేరారు. ఇక తుని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ తన అనుచరులతో త్వరలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రధాన పార్టీలకు చెందిన మరికొందరు కాపు నేతలు కూడా పవన్ ఆహ్వానం మేరకు రానున్న రోజుల్లో జనసేనలో చేరబోతున్నారని సమాచారం. అయితే ఆయన ఓ రాజకీయ పార్టీ నేతగా అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తే, జనసేన మనుగడకే ప్రమాదం ఉండదని, లేదంటే మరో ‘ప్రజారాజ్యం’ గా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 
మరోవైపు తనకు కుల మతాల పట్టింపు లేదని పదే పదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ జనసేనలో కులానికే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పవన్ కొత్త తరానికి కొత్తరాజకీయం అవసరమని చెప్పుకుంటూనే పాతకాపులకే ప్రాధాన్యమిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా పవన్ యువతకు 60 శాతం, సీనియర్లకు 40 శాతం సీట్ల పేరుతో ఇతర పార్టీల నేతలకు గాలమేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ మధ్య జనసేనలో చేరినవారిలో అధికశాతం మంది కాపులే ఉన్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఇతర సామాజికవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో జనసేనకు కాపు నాయకులు ఉంటే చాలా ? రేపు ఓట్లు కూడా ఆ ఒక్క సామాజిక వర్గం వాళ్లే వేస్తే చాలా ? అని వారంతా ప్రశ్నిస్తున్నారట. ఏదీ ఏమైనప్పటికీ తరచూ సామాజిక న్యాయం అని చెప్పే పవన్ దానిని ఆచరణలో చూపాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.