పవన్ అనుకున్నదొకటి.. జరుగుతోంది మరొకటి

అప్పుడు ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్నాడు.. ఇప్పుడు ప్రజల కష్టాలు తీర్చాలంటే సీఎం అవ్వాలంటున్నాడు. అప్పుడు నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు మంచోడన్నాడు.. ఇప్పుడు అనుభవం ఉంటే సరిపోదు అంటున్నాడు. అప్పుడు టీడీపీని గెలిపిస్తేనే ఏపీ బాగుపడుతుందన్నాడు.. ఇప్పుడు టీడీపీని ఓడించాలంటున్నాడు. అతడెవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అదేనండీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన పవన్.. ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటయాత్రను కూడా ప్రారంభించాడు.

ఆ యాత్రకు వస్తున్న స్పందన చూసిన పవన్.. కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ మాదిరి ఏపీలో చక్రం తిప్పొచ్చని భావించాడని టాక్ వినిపించింది. స్పందన చూసిన జన సైనికులు తమ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే భ్రమల్లో ఉండిపోయారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాడు జనసేనాని. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య పవన్ కల్యాణ్ కూడా అలాంటి భ్రమల్లోనే ఉన్నారనే విషయం ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. అయితే ఇంతలోనే జనసేనకు ఊహించని కష్టం ఎదురైందట. వచ్చే ఎన్నికల వరకు ఇదే కొనసాగితే తమ పార్టీ భవిష్యత్ ఎంటనే ఆలోచనలో పడిందట అధిష్టానం.

వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న జనసేన పార్టీకి.. అభ్యర్ధులు దొరకడం లేదని తెలుస్తోంది. పవన్ చేస్తున్న ప్రజాపోరాట యాత్రకు స్పందన బాగానే ఉంది కానీ, పార్టీలోకి చేరికలు మాత్రం జగడంలేదట. ఈ విషయంలో పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారట. వాస్తవానికి జనసేన తరపున టీడీపీ నుంచి కొందరు, వైసీపీ నుంచి కొందరు పోటీ చేస్తామని చెప్పారట. ఈ పార్టీల్లో టికెట్ రాదని అనుకునే వాళ్లు జనసేన నుంచి పోటీ చేయడానికి ముందుకొస్తారని భావించినా అలా జరగడం లేదట. ఎందుకంటే అటు సీఎం కానీ, ఇటు జగన్ కానీ తమ అభ్యర్ధులను ప్రకటించడంలేదు. ఒకవేళ ప్రకటిస్తే జనసేనలోకి జంప్ అయ్యే అవకాశం ఉండడం వల్లే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

రెండు ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించకపోయినా.. జనసేనలోకి వెళ్తే టికెట్ వస్తుందని అనుకునే వాళ్లకు ఆ పార్టీ నేతలు ఊహించని సమాధానం చెబుతున్నారట. జనసేన నుంచి పోటీ చేయాలంటే.. ఎన్నికల్లో మీ డబ్బు మీరే ఖర్చు చేసుకోవాలని కండీషన్ పెడుతున్నారట. దీంతో.. జనసేన పార్టీ తరపున పోటీ చేయడం ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే ఇంకేమీ ఉండదని కొందరు నాయకులు ఆ పార్టీ నేతలతోనే వ్యాఖ్యానించినట్టు సమాచారం. కొందరైతే మీ పార్టీ తరపున పోటీ చేస్తాం కానీ… మీరే మా ఎన్నికల ఖర్చు భరించాలని వారికే షాక్ ఇస్తున్నారట. మొత్తానికి ఏపీలో కీలకంగా మారాలనుకున్న పార్టీకి ఊహించని కష్టం వచ్చి పడిందన్న మాట. మరీ జనసేనాని దీని నుంచి పార్టీని ఎలా కాపాడుతాడో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.