లోకేష్ టార్గెట్ గా పవన్

టీడీపీ టార్గెట్ గా సాగింది పవన్ కల్యాణ్ ప్రసంగం. నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏం అనని పవన్ ఇప్పుడు ఏకంగా అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం సర్కారుపై ధ్వజమెత్తడం రాజకీయంగా కలకలం రేపుతోంది. చంద్రబాబు సర్కారు దుష్పరిపాలన, ఆయన తనయుడు లోకేశ్‌ విచ్చలవిడి అవినీతి, టీడీపీ నేతల అరాచకాలంటూ ఆయన ప్రసంగం సాగింది. లోకేశ్‌ చేస్తున్న అవినీతి చంద్రబాబుకు కనిపించడం లేదా? అని నిలదీశారు. లోకేశ్‌ అవినీతి మీ దృష్టికి వచ్చిందా? రాలేదా? అని బాబును ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ మనవడు ఏం చేస్తున్నాడు? లోకేశ్‌ అవినీతిని చూసి.. ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోందని పవన్‌ అన్నారు.
ఐటీ దాడుల్లో దొరికిపోయిన టీడీపీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి కేసులో లోకేశ్‌ పేరు వినిపించిందన్నారు. లోకేశ్‌ను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లివచ్చారని కొత్త సంగతి చెప్పారు. ప్రధాని మోదీకి ఆయన భయపడుతున్నారని చెప్పారు. టీడీపీ నేతల అవినీతిపైనా పవన్‌ ఘాటు వ్యాఖ్యలే చేయడం హాట్ టాపికైంది. ఇసుక మాఫియా మొదలు కనకదుర్గమ్మ గుడి వద్ద పార్కింగ్‌ వరకు అన్నింటిలోనూ టీడీపీ నేతల దోపిడీ కొనసాగుతోందని మండిపడ్డారు. 
2019 ఎన్నికల్లో జగన్‌ను ఎదుర్కొనేందుకు అవినీతికి పాల్పడుతున్నామని టీడీపీ నేతలు బాహాటంగానే చర్చించుకుంటున్నారని చెప్పారు పవన్. చంద్రబాబును ఎదిరించేందుకు సిద్దంగా ఉన్నానని బాహాటంగా చెప్పినా అది సభ వరకే పరిమితమనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల కోసం ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు అప్పుడే సిద్ధం చేసి పెట్టామని టీడీపీ నేతలు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని పవన్ అన్నారు. చాలా కొత్త సంగతులను పవన్ ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపికైంది. పవన్ మాటలు టీడీపీని డ్యామేజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపిందని ధ్వజమెత్తిన తీరుపై ఆపార్టీ నేతలు విరుచుకుప్డడారు. 
రెండు రోజుల పాటు బాగా కసరత్తు చేసిన తర్వాత పవన్ తన ప్రసంగ పాఠాన్ని తయారు చేశారు. కాకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలు ఆయనతో మాట్లాడటం వల్లనే ఈ అంశాలన్నీ వచ్చాయని తెలుస్తోంది. హోదాను చంద్రబాబు ఎందుకు తాకట్టు పెట్టారు? అర్ధరాత్రి చీకటి ఒప్పందం చేసుకొని ప్యాకేజీని చంద్రబాబు ఒప్పుకున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు సర్కారకు వచ్చే ఎన్నికల్లో తాను అండగా ఉండబోనని తేల్చి చెప్పారు.
ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో నీరజాక్షిపై దాడి చేస్తారా? మహిళ అధికారిపై దాడి చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కొమ్ములు ఉన్నాయా? అని పవన్‌ అడిగారు. ఆ ఎమ్మెల్యేకు చట్టం వర్తించదా?.. మీరు ఏం చేస్తున్నారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగపూర్‌లో ఇదే విధంగా దాడి జరిగితే.. తోలు ఊడేలా కొట్టేవారని పవన్‌ అన్నారు. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.
ఆమరణ దీక్ష….
ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి మర్చిపోలేదు. బాధ్యతతో ఉన్నాం. ప్రజలకు అండగా ఉంటాం. చేవ చచ్చిపోలేదని ప్రజలకు చెప్పారు పవన్ కల్యాణ్. 
జగన్ పార్టీ నేతలు… అసలు అసెంబ్లీకే రారా అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నిలదీశారు. జగన్‌ సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తారా అని  ప్రశ్నించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులు చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీ యాజమాన్యం మోసం చేస్తే వాళ్లకే చంద్రబాబు అండగా ఉన్నారన్నారు. నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వం విఫలమైందనడానికి ఫాతిమా కాలేజీ విద్యార్థులే నిదర్శనమన్నారు పవన్. రాబోయే ఎన్నికల్లో నిజాయితీగా ఉన్నవారికే అండగా ఉండాలని పవన్ కల్యాణ్‌ కోరారు. ప్రజల సొమ్ముతోనే ప్రజల ఓట్లు కొంటున్నారని ఆరోపించారు. నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోండని… జనసేనకు మాత్రం ఓటేయండని పిలుపునిచ్చారు. దేవుడిపై ఒట్టేసి తీసుకున్నా సరే జనసేనకు ఓటేయండని అన్నారు. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరు ఎందుకు పెట్టరని, పథకాలన్నింటికీ చంద్రన్న పేర్లు ఎందుకు అంటూ నిలదీశారు. మాజీ ప్రధానులు ఇందిరగాంధీ, రాజీవ్‌ గాంధీ విషయంలోనూ అదే చేశారని చెప్పారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.