పవన్ వ్యూహం: ఒకవైపు మహిళలు… మరోవైపు కుల నేతలు

రాజ‌కీయాల్లో ఎక్కువ శాతం సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించ‌డం, కుల నేతలను ప్రోత్సహించడం ద్వారా పవన్ ముందుకు వెళ్లాలనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి పోరాట యాత్ర‌కు  శ్రీకారం చుట్టిన పవన్‌ కల్యాణ్‌ జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తద్వారా ప్రధాన పార్టీలకు ధీటుగా పుంజుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాల్లో జనసేనకు నాయకులను నియమించని ఆయన తాజాగా వారి నియామకంపై దృష్టి సారించారని తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ వ్యవహారాల సమన్వయకర్తలుగా ముగ్గురిని నియమించారు. వీరిలో ఇద్దరు మహిళలే కావడం విశేషం. అయితే జిల్లా జనాభాలో పురుషుల కంటే మహిళా జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనసేనలో మహిళా నాయకత్వానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని పవన్‌ నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది.  అందులో భాగంగానే తొలి నియామకంలో మహిళలకు పెద్దపీట వేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. కొత్తగా నియమితులైన రాజకీయ వ్యవహారాల సమన్వయకర్తల్లో శ్రీకాకుళం నుంచి బీఎస్‌ ప్రభు, పాల కొండ నుంచి పి.యశస్విని, పలాస నుంచి సుజాత పండా ఉన్నారు. పాలకొండకు చెందిన వీరఘట్టం మండల మాజీ ఎంపీపీ కుమార్తె పాలవలస యశస్విని ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. తనకు జిల్లాలో జనసేన బాధ్యతలు అప్పగిస్తే సమర్థంగా పనిచేస్తానని పవన్‌కు వివరించడంతో ఆమెను పాలకొండ డివిజన్‌లో నియమించారు. పలాసలో సుజాత పండా టెక్కలి డివిజన్‌ పరిధిలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. వీరంతా ఇకపై జిల్లాలో పది నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మండల, నియోజక వర్గ స్థాయిల్లో కొత్త నేతలను గుర్తించే దిశలో చర్యలు తీసుకుంటారు. పనితీరు ఆధారంగా పదవులు కట్టబెట్టడం జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి కావడంతో ఈ విధానం అందరికీ వర్తిస్తుందని నేతలు చెబుతున్నారు. మరోవైపు ఏపీ రాజకీయాల్లో అన్ని పార్టీలు కుల రాజకీయాలకే పెద్ద పీట వేస్తుంటాయన్న వార్తలు వినిపిస్తుంటాయి. మొట్టమొదటి నుంచి బలమైన సామాజిక వర్గం అయిన కమ్మ వర్గం తెలుగుదేశానికి కాపు కాస్తున్నదనే విమర్శ ఉంది. అలాగే కాంగ్రెస్ కి అండగా ఉంటూవస్తున్న రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి జగన్ వెంట నడుస్తూ వస్తోంది. అయితే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కాపులకు తగిన న్యాయం చేయలేదనే వాదన ఉంది. అందుకే కాపు వర్గాన్ని పవన్ దగ్గర చేసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ తాను అసలు కులం అన్న పదాన్ని ఇష్టపడను అని అంటున్నారు. ఇలా అందరితో చెబుతూనే తన పార్టీలో ముఖ్య నేతలుగా తన వర్గం నుంచే తెచ్చుకుంటున్నారని సమాచారం. దీనిని చూస్తుంటే పవన్ ముందుగా కుల నాయకుడుగానే ఎదుగుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. పవన్ వైఖరి గమనిస్తే ఆయన ఒకవైపు మహిళలను, కులనేతలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.