దూకుడు పెంచిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని ఏం అనడం లేదు. కానీ హోదా కోసం కొత్తగా పోరాటం చేస్తున్న టీడీపీ పై టార్గెట్ పెట్టారు. అసలు చంద్రబాబునాయుడు వల్లనే ఏపీకి హోదా రాలేదన్నారు. అంతే కాదు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ముఖ్యమంత్రేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. పోరాడితే పోయేదేముంది. చంద్రబాబుతో మరింత వ్యతిరేకత తెచ్చుకోవడం తప్ప అనుకుంటున్నారు పవన్. అందుకే ఇక లాభం లేదని ఏకంగా చంద్రబాబు, లోకేష్ ల పైనా విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. పవన్ దూకుడు చూస్తే జగన్ కూడ అలా మాట్లాడరేమో అనిపించేలా ఉన్నాయి. 
శ్రీకాకుళంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సంగతి అందరికీ తెలుసన్నారు. ఎన్నికల్లో ఎన్‌టీఆర్‌ ఫొటో, అయన పథకాలు వాడుకొని గెలిచారని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. తన పర్యటనను అడ్డుకుంటున్నారనే ఆలోచనలో ఉన్నారు పవన్. అందుకే గతం కంటే ఎక్కువగా చంద్రబాబు పై మాటల దాడి చేస్తున్నారు జనసేన అధినేత. 
మరీ ముఖ్యంగా మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు వంటి నాయకులు పై విరుచుకుపడుతున్నారు. వారిద్దరు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. జనసేనకు ఒక్క శాతం ఓట్లు లేవని చంద్రబాబు అంటున్నారు. కానీ అదే బాబు 2014లో ఎవరి మద్దతుతో అధికారంలోకి వచ్చారో గుర్తు చేసు కోవాలన్నారు. జనసేనకు ఉన్న ఓటు బ్యాంకు ఏమిటో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చూపిస్తామని చెప్పారు. అధికారం కోసం పాకులాడమని, ఆత్మస్థైర్యంతో పోరాటం చేస్తామని పవన్‌ కళ్యాణ్ అనడం హాట్ టాపికైంది. మహానాడు ఇచ్చిన ఉత్సాహంతో టీడీపీ  శ్రేణుల్లో మరింతగా ముందుకెళుతున్నాయి. గత మహానాడు కంటే ఈ సారి సభలో సక్సెస్ ఎక్కువగా ఉంది. క్యాడర్ బాగానే వచ్చింది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ మాటలు చర్చనీయాంశమయ్యాయి. తాను ఏం చెప్పినా… ప్రభుత్వం స్పందించడం లేదంటున్నారు. 
గతంలో పవన్ కు ప్రభుత్వ సహకారం ఉండేది. ఆయన ఏం చెప్పినా చేసేవాళ్లు. ఇప్పుడు అసలు పవన్ చెబితే చేయడం కాదు..చేసే వారు పక్కకు వెళుతున్నారు. పవన్ కోసం మంత్రులనే పంపిన చరిత్ర చంద్రబాబుది. కానీ ఇప్పుడు అదే మంత్రులను దూరం పెట్టే పరిస్థితి. మారిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోలేక పవన్ మండిపడుతున్నారని అర్థమవుతోంది. అందుకే అక్కసులో విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.