అవగాహన లేకపోతే పవన్‌లా నవ్వులపాలు అవ్వాల్సిందే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. నాలుగేళ్ల క్రితం ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినా పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. చంద్రబాబు, మోదీ మీదున్న నమ్మకంతో పాటు, పవన్ పర్యటనలు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయని చెబుతుంటారు. కొద్దిరోజుల క్రితం వరకు ఈ కూటమితోనే ఉన్న జనసేనాని.. గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

అప్పటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు. దానికి అనుగుణంగా ఆయన రాష్ట్రమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రజాపోరాట యాత్ర పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. టీడీపీ బలమున్న ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ సభలకు భారీగానే ప్రజలు హాజరవుతున్నారు. అయితే, ఈ సభలు సక్సెస్ అయినా.. ఒక్కోసారి పవన్ మాట్లాడే మాటలకు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనసేన నాయకుల తప్పుడు సమాచారమో.. పవన్ అవగాహనా రాహిత్యమో తెలియదు కానీ, ఆయన చేసే ప్రసంగం ఒక్కోసారి నవ్వులపాలు అవడానికి కారణమవుతోంది.

పవన్ వ్యాఖ్యలపై యువత మనస్తాపం

మాడుగుల ప్రాంతంలో ఉపాధి లేకపోవడంతో యువత గంజాయి రవాణాకు దిగుతున్నారని పవన్‌ చేసిన వ్యాఖ్యలపై స్థానిక యువత తీవ్ర మనస్తాపం చెందుతున్నది. మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొంతమంది మాత్రమే గంజాయి కేసుల్లో నిందితులని, అటువంటిది తమపై గంజాయి మచ్చ ఎలా వేస్తారని యువకులు ప్రశ్నిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పర్యటించే ప్రాంతాల గురించి పార్టీ శ్రేణులు అవగాహనలోపంతో, తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని, ఆయన ఈ విషయం తెలుసుకుని సరిదిద్దుకోవాల్సిన అవసరం వుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

జనసేనానికి తప్పుడు సమాచారం

పవన్‌ ఏ ప్రాంతంలో పర్యటిస్తే ఆ ప్రాంతంలోని సమస్యలపై జనసేన కార్యకర్తలు ఆయనకు ముందుగా సమాచారాన్ని ఇస్తుంటారు. మాడుగులలో డిగ్రీ కళాశాల లేదని ఆయన విమర్శ చేయడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఇక్కడ 2008లోనే డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. ప్రస్తుతం జూనియర్‌ కళాశాల భవనాల్లో నడుస్తున్నది. ఈ ప్రాంతంపై ఆయనకు సరైన సమాచారం ఇవ్వలేదని పలువురు వ్యాఖ్యానించారు. దీనితో పాటు పాయకరావుపేటలో పర్యటిస్తున్న సమయంలో పీహెచ్‌సీకి, సీహెచ్‌సీకి తేడా తెలియకుండా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. దీనిని స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత తప్పుబట్టారు. వీటి నుంచైనా పవన్ పాఠాలు నేర్చుకుంటారో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.