పవన్ సంచలన ప్రకటన చేయబోతున్నాడా..?

గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలపిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నాడు. ఇందుకోసం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాడు. దీనితో పాటు ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రభుత్వంపై విభేదించినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్న జనసేనాని, ప్రజాపోరాటయాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని భావించాడు. ఈ యాత్రలోనే అన్ని జిల్లాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకుని, పార్టీ నిర్మాణం గురించి చర్చించాలని అనుకుంటున్నాడు. ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని కూడా పార్టీ కోసమే కేటాయించాడు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చలు కూడా జరిపాడు. ఈ భేటీల్లో మెజారిటీ సభ్యులు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయపరంగా పార్టీ వేగంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందని, ఇది జరగాలంటే పార్టీ నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో బలపడక తప్పదనే వాదనను పవన్ ముందు ఉంచారట. వారి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకునే జనసేనాని పార్టీ నిర్మాణం పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

కొద్దిరోజుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన మొదలుపెట్టబోతున్న జనసేన అధినేత, సోమవారమే ఆ జిల్లాకు చేరుకున్నాడు. పశ్చిమతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం దృష్ట్యా పవన్‌ ఈ జిల్లా పర్యటనలోనే ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడా అనే ఆసక్తి నెలకొని ఉన్న నేపథ్యంలో ఓ వార్త బయటికి వచ్చింది. గతంలో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు సొంత జిల్లాలోనే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. తన స్వగ్రామం ఉన్న పాలకొల్లు నుంచి పోటీ చేస్తే అక్కడి ప్రజలు చిరంజీవిని ఓడించారు. దీంతో పవన్ ఇప్పుడు ఎక్కువ దృష్టి ఈ జిల్లాపైనే పెట్టినట్లు తెలుస్తోంది. అందుకోసం పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పవన్ సిద్ధమయ్యాడని, కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న పర్యటనలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ జిల్లా నుంచి జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్ధులను కూడా పవన్ ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి, ప్రభుత్వ అధికారాన్ని నిర్ణయించే కీలకమైన జిల్లాలో జెండా ఎగురవేయాలని భావిస్తున్న పవన్ ఆశలు నెరవేరుతాయా..? లేదా..? వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.