7 సిద్ధాంతాలు.. 12 హామీలతో జనసేన మేనిఫెస్టో రిలీజ్

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కారణంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచాడు. ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూనే మరోపక్క పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని భావించిన పవన్.. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుని, గోదావరి జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నాడు. తన సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలో ప్రస్తుతం యాత్ర చేస్తున్న జనసేనాని, గతంలో ప్రకటించిన దాని ప్రకారం మంగళవారం(ఆగస్టు 14) ఆ పార్టీ మేనిఫెస్టో డాక్యూమెంట్‌ను భీమవరంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విడుదల చేశాడు. ఇందులో జనసేనకు సంబంధించిన ఏడు సిద్ధాంతాలు, 12 హామీలు పొందుపరిచారు.

జనసేన సిద్ధాంతాలు
1. కులాలను కలిపే ఆలోచనా విధానం, 2. మతాల ప్రస్తావన లేని రాజకీయం, 3. భాషల్ని గౌరవించే సాంప్రదాయం, 4. సంస్కృతుల్ని కాపాడే సమాజం, 5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, 6. అవినీతిపై రాజీలేని పోరాటం, 7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం

జనసేన హామీలు
1. మహిళలకు 33% రిజర్వేషన్లు, 2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, 3. రేషన్‌కు బదులుగా మహిళల ఖాతాల్లో నెలకు రూ. 2500 నుంచి 3500 వరకు జమ, 4. బీసీలకు అవకాశాన్ని బట్టి మరో 5% వరకు రిజర్వేషన్ల పెంపుదల, 5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, 6. కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్లు, 7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, 8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్, 9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతి గృహాల ఏర్పాటు, 10. ముస్లింల అభివృద్ధికి సచార్ విధానాలు, 11. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు, 12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

పవన్ తన పార్టీ మేనిఫెస్టో డాక్యూమెంట్‌లో పేర్కొన్న సిద్ధాంతాలు, హమీలను పరిశీలిస్తే గతంలో వీటిని పలు రాజకీయ పార్టీలు చెప్పినవే కానీ, ఇందులో కొన్ని కొత్త అంశాలు చేర్చారు. ఈ కాపీలోని చివరి భాగంలో మాత్రం ‘‘మేము చెప్పే విషయాలు సాహసోపేత నిర్ణయాలని తెలుసు. కానీ మనసుంటే మార్గముంటుందని బలంగా విశ్వసిస్తున్నాము. ఈ చిరు దీపం కోట్లాది మందికి వెలుగునిస్తుందని ఆశిస్తూ.. మీ పవన్ కల్యాణ్’’ అని రాశారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలిస్తే గతంలో చాలా పార్టీలు చేసిన తప్పునే ప్రస్తుతం జనసేన కూడా చేస్తున్నట్లు అర్థమవుతోంది. చాలా పార్టీల వలె జనసేన కూడా ఇందులో పేర్కొన్న హామీలను ఎలా నెరవేర్చుతారో చెప్పలేదు. ఇది ఆ పార్టీకి మైనస్‌ అయ్యే అవకాశం కూడా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.