ఆయన జనసేనలోకి రావడం పవన్‌కు ఇష్టం లేదా..?

టీడీపీ బహీష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన ఈ మధ్య ఏం చేసినా సంచలనమే అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేతకు ఎదురుతిరిగి ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత మోత్కుపల్లి.. చంద్రబాబుపై పోరాటం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆయన.. ఇటీవల తిరుమల వెళ్లి మరీ టీడీపీ ఓడిపోవాలని శ్రీవారికి మొక్కుకున్నారు. అంతేకాదు, ఆయనను ఓడించేందుకు ఏపీలో యాత్ర కూడా చేస్తానని చెప్పిన ఆయన.. కొద్దిరోజుల క్రితం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిశారు. పవన్-జగన్ వివాదంపై ఇటీవల స్పందించిన మోత్కుపల్లి.. వాళ్లను గొడవ పెట్టుకోవద్దని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఇద్దరూ గొడవలు పెట్టుకోకుండా కలిసి మెలసి ఉండాలని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని ఇద్దరు అధ్యక్షులకు సూచించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వాలనుకున్నారు మోత్కుపల్లి. ఇందుకోసం ఆయన జనసేన కార్యాలయానికి వెళ్లగా, అనివార్య కారణాల వల్ల వీరి భేటీ రద్దైంది. అయితే, దీనికి సంబంధించి ఓ వార్త బయటికొచ్చింది.

వీళ్లిద్దరూ భేటీ కాబోతున్నారని తెలిసినప్పటి నుంచి మోత్కుపల్లి జనసేనలో చేరబోతున్నారని, ఆయనకు తెలంగాణ పగ్గాలు అప్పజెప్పాలని పవన్ నిర్ణయించుకున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే, వీళ్ల భేటీ రద్దు అవడంతో వీటికి పుల్‌స్టాప్ పడింది. వాస్తవానికి పవన్ కల్యాణ్ కూడా మోత్కుపల్లి విషయంలో ఇదే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాకపోతే, ఆయనపై వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వల్ల పవన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీనితో పాటు, సీనియర్ నేత అయిన మోత్కుపల్లి వల్ల పార్టీకి వచ్చే లాభం లేకపోగా, నష్టమే ఎక్కువ ఉంటుందని పార్టీలోని కొందరు నేతలు పవన్‌తో అన్నారట. అంతేకాదు, ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పజెబితే ఫ్యాన్స్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నదని పవన్ భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌తో పవన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో మోత్కుపల్లి వల్ల అవి చెడిపోయే ఆస్కారం కూడా ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే, ఏపీలో వలె, తెలంగాణలో జనసేనను నడిపించే నేత ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.