పవన్ జగన్ ల వైరంతో తెలుగుదేశానికి మరో ప్లస్ పాయింట్!

పవన్, జగన్ ఎన్నికల్లో పరస్పర అవగాహనతో వ్యవహరిస్తారని ఇన్నాళ్లూ టీడీపీ అగ్రనాయకత్వం అనుమానించింది. ఫలితంగా రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రల్లో భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని ఆందోళనకు లోనైంది. ఈ రెండు పార్టీలు పరోక్ష అవగాహనతో వ్యవహరిస్తే టీడీపీ కి కష్టాలు తప్పవని పరిశీలకులు కూడా అంచనా వేశారు. అయితే తాజాగా జగన్.. పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడటంతో ఆ రెండు పార్టీ మద్య రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇవి టీడీపీకి కలిసివచ్చేలా పరిణమించాయని తెలుస్తోంది. కాగా వ్యక్తిగత విషయాల్లో జగన్ విమర్శలు చేయడంతో జనసేనను వైసీపీ శాశ్వతంగా దూరం చేసుకున్నట్లయ్యిందని తెలుస్తోంది. జనసేన అగ్రనాయకులు సంయమనం పాటిస్తున్నప్పటికీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోతోంది. పవన్ తేలికగా తీసుకున్నప్పటికీ ఆయన అభిమానులు జగన్ కుటుంబంపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని తిప్పికొట్టడంలో వైసీపీ  విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి. మరోవైపు జగన్ వ్యాఖ్యలపై పార్టీ వ్యూహకర్త ప్రశాంత కిశోర్ తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీని కౌంటర్ చేసి జగన్ కు అధికారం దక్కేలా చూడటమే అతని ప్రధాన బాద్యత. పవన్ కల్యాణ్ విషయంలో అనవసర వివాదాలు కొని తెచ్చుకోవద్దని గతంలోనే జగన్ కు ప్రశాంతకిశోర్ సూచన చేసినట్లు సమాచారం. ఆ మేరకు జగన్ మీడియా సైతం పవన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ దుందుడుకు తనాన్ని పవన్ తనకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ‘విధానాలపై మాత్రమే విభేదిస్తాను. జగన్ కుటుంబ సభ్యులను ఎవరూ కించపరచవద్దు. వారిని వివాదంలోకి లాగవద్దు.’ అంటూ జనసేనాని  అభిమానుల కోసం ఒక ప్రకటన చేశారు.  ఈ విషయంలో పవన్ పక్కా వ్యూహంతోనే స్పందించారు. వైసీపీ, జనసేన రెండూ యువనాయకత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీలు. పలు సామాజికవర్గాల మద్దతుతో వైసీపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. జనసేన ఇప్పుడిప్పుడే రంగంలోకి దిగి తనను తాను నిరూపించుకును ప్రయత్నం చేస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఈ రెండుపార్టీల మధ్య ఏర్పడిన అగాథం టీడీపీ కి కలిసివచ్చేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.