టీఆర్ఎస్ విజయంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్‌గా ఉన్న జనసేన.. తెలంగాణ ఎన్నికలను లైట్ తీసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించాడు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో నిర్ధేశిత కాల పరిమితిలో ఎన్నికలు జరిగినట్లైతే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఒక ప్రణాళికను రూపొందించుకున్నాము. అయితే ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒకింత కష్టతరంగా భావించాము. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యం. శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని తెలంగాణ ప్రజలకు వినయపూర్వకంగా తెలియజేస్తున్నాము- జైహింద్’’ అంటూ ప్రకటనను విడుదల చేశాడు పవన్. అలాగే జనసేన కార్యకర్తలు ఎవరికి ఓటు వేయాలో కూడా వెల్లడించాడు. ‘‘ప్రజలకు న్యాయం చేయగల బలమైన నాయకుడికి, ఉన్న వారిలో ప్రజల్ని మోసం చేయకుండా సుపరిపాలన అందించగల వారిని గెలిపించమని ఆ పార్టీ అభిమానులకు సందేశమిచ్చాడు జనసేన అధినేత.

తెలంగాణలో మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయం సాధించింది. దీంతో టీఆర్ఎస్ విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాడు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. అందులో ‘‘ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు. ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’’ అని చెప్పుకొచ్చాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.