జనసేనుడి దృష్టి వాళ్ళపై అందుకే పడిందా..?

అనంతపురం జిల్లాలోని బలిజ సామాజికవర్గం ఓట్లను చీల్చేందుకు జనసేన సకల యత్నాలు చేస్తోంది. ఆరు రోజుల పర్యటనకు వచ్చిన పవన్‌కల్యాణ్ అనంతలో కరువురైతు కవాతును నిర్వహించారు. ఆ కవాతుకి బలిజ సామాజికవర్గం వారే పెద్దసంఖ్యలో హాజరయ్యారు. జిల్లాలో అనంతపురం, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో బలిజలు పెద్దసంఖ్యలో ఉన్నారు. పవన్‌కల్యాణ్ టూర్ సహా ఆయన కార్యక్రమాలన్నీ బలిజలు అధికంగా ఉన్న ప్రాంతాలు కేంద్రంగానే సాగాయి. రైతు కష్టాలను తెలుసుకోవడానికి నారాయణపురం అనే గ్రామానికి ఆయన వెళ్లారు. అక్కడా బలిజలే ఎక్కువ. టీడీపీ కుంభస్థలాన్ని కొట్టాలని బహిరంగసభల్లో పవన్ మట్లాడారు. 

జిల్లాలో ఉన్న బలిజల్లో చాలామంది ముందునుంచీ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే.. ఏడు నియోజకవర్గాల్లో వారి ప్రభావం అధికంగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లోనూ బలిజలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావితం చేసే పరిస్థితి లేదన్నది పరిశీలకుల అభిప్రాయం. ఏడు నియోజకవర్గాల్లో ఉన్న బలిజలపై ఎక్కువగా పవన్‌కల్యాణ్‌ దృష్టి పెట్టినట్టు సమాచారం. జిల్లాలో జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేకపోయినప్పటికీ జిల్లాకు పవన్ వచ్చిన ప్రతిసారీ బలిజ సామాజికవర్గానికి చెందిన ముఖ్యులే కార్యక్రమాల బాధ్యత తీసుకుంటున్నారు. గతంలో అనంత పర్యటనకు పవన్ వచ్చినప్పుడూ అంతే! ఫ్లెక్సీలు మొదలుకుని బహిరంగసభ ఏర్పాట్లు, అవసరమయ్యే ఖర్చును కూడా స్థానిక పార్టీ నాయకులు, బలిజ నాయకులే భరించారు. ఈసారి ఇతర కులస్థులను కలుపుకుపోవాలని ప్రయత్నించినప్పటికీ బలిజ సామాజికవర్గం వారే తమ ఆధిక్యతని ప్రదర్శించారు. బలిజలు టీడీపీకి దూరమైతే తమకు కూడా లాభమేనని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బలిజ పెద్దలు టీడీపీ వెంటే ఉండగా.. యువకులు, విద్యార్థులు మాత్రమే పవన్ వెంట వెళ్తున్నారట. అయితే వారిలో సగం మందికి ఓటుహక్కు లేదట. పవన్ సభలకు పెద్దసంఖ్యలో ఉత్సాహంగా వస్తున్న వారిలో చాలామంది కాలేజీ పిల్లలేనట. అయితే ఎన్నికలనాటికి వారిలో చాలామందికి ఓటు హక్కు వస్తుంది. కానీ జిల్లాలో పార్టీని నడిపే నేతలు మాత్రం కరవయ్యారట. పవన్, జనసేన అభిమానులుగా ప్రచారం చేసుకుంటున్న యువత అనంతపురం జిల్లాకు ఆయన వచ్చినప్పుడు మాత్రమే క్రియాశీలం అవుతున్నారట. ఆ తరవాత పార్టీ కార్యక్రమాలేవీ యాక్టివ్‌గా సాగడం లేదట. అయితే ఫ్యాన్స్‌తో మాత్రమే వ్యవహారాలు నడపడం ఆపి.. పార్టీ నిర్మాణంపై దృష్టిసారిస్తే మంచిదంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా పార్టీకి బూత్ ఏజెంట్లు కూడా లేని పరిస్థితి. ముందుగా ఇలాంటి అంశాలపై దృష్టిపెట్టి పార్టీని పటిష్టపరిస్తే బలిజలే కాక ఇతర సామాజికవర్గాలకు చెందిన యువకులు కూడా పవన్ వెంట వస్తారన్నది రాజకీయ విశ్లేషకుల సూచన! చూద్దాం పవన్‌ ఏ పంథాలో నడుస్తారో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.