పవన్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఏపీలోని పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. రాష్ట్రంలో బలపడేందుకు అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన జనసేన ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచాడు. ఒకవైపు ప్రజాపోరాటయాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తుండగానే, మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం జిల్లా స్థాయి, మండల స్థాయి నేతలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసి, వారికి అవగాహణ నింపేందుకు కృషి చేస్తున్నాడు. మరోవైపు సంస్థాగత నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని భావిస్తున్న జనసేనాని.. కొన్ని జిల్లాలకు ఇన్‌చార్జిలను నియమించాడు. ఇప్పటి వరకు సానుకూలంగా సాగుతున్న జనసేన రాజకీయం.. ఈ పరిణామంతో పట్టుతప్పే ప్రమాదంలో పడింది.

ముందుగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల(ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాల)కు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను ప్రకటించింది జనసేన అధిష్టానం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు త్వరలో బాధ్యులను ప్రకటించనున్నారు. పదవులు ప్రకటించిన జిల్లాలలో స్థానిక ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి పార్టీ కోసం పని చేసిన తమకు న్యాయం జరగలేదని సదరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పెట్టినప్పటి నుంచి జెండాలు పట్టుకుని తిరుగుతున్న వారికి న్యాయం జరగడంలేదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన నేతలే ఇప్పుడు కూడా జనసేనలో చక్రం తిప్పుతున్నారట. దీంతో పవన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే జనసేనలో పవన్ ఫ్యాన్స్‌కు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.