పవన్! మీరు ప్రగతి నిరోధకులు కాక మరేమిటి?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరం నిర్మాణం అనే విషయంలో.. స్థలం ఎంపికలోనే అక్రమాలు ఉన్నాయని, అధినేతల స్వార్థం ఉన్నదని, ఒక కులానికి, ఒక ప్రాంతానికి న్యాయం చేయడానికే ఈ ప్రయత్పం జరుగుతున్నదని… రకరకాల ఆరోపణలు ఇటీవలి కాలంలో వినిపిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ఆరోపణలన్నీ నిజం అనే అనుకుందాం… మరి ఆ విషయాన్ని గుర్తించిన వాళ్లు మాట్లాడాల్సింది ఎప్పుడు..? కొన్ని నిర్మాణాలు సగంలో ఉండగా.. రాజధాని కి వైభవ చిహ్నాలుగా నిలిచే నిర్మాణాలకు సంబంధించిన నిధుల సమీకరణ పనులు టాప్ గేర్ లోకి చేరుతున్న సమయంలోనా?

స్వార్థంతో పక్షపాతంతో స్థలం ఎంపిక జరుగుతున్నప్పుడు… ఇవాళ నిందలు వేస్తున్నవాళ్లంతా నిద్ర పోతున్నారా? అనే సందేహాలు పవన్ కల్యాణ్ వ్యవహారాల్ని చూస్తే ప్రజలకు కలుగుతున్నాయి. ఎందుకంటే.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత చందంగా.. చంద్రబాబునాయుడును తిట్టడం కొత్తగా ప్రారంభించిన తర్వాత.. ముందూ వెనుకా చూసుకోకుండా.. నిజానిజాల విచక్షణ కూడా లేకుండా ఎలా పడితే అలా అడ్డగోలుగా చెలరేగిపోతున్న పవన్ కల్యాణ్ తాజాగా ‘ఎవరి రాజధాని, అమరావతి?’ అనే పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించబోతున్నాడు. ఆయన ఇప్పటికే ఒక కులానికే పరిమితమైన రాజధాని నగరం అంటూ అమరావతి మీద ఆల్రెడీ ఒక బురద మరక వేసేసి ఉన్నారు కూడా!

ఈ ‘ఎవరి నగరం, అమరావతి?’ పుస్తకాన్ని రాసిన గ్రంథకర్త.. అమరావతి కోసం స్థల సమీకరణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన ఐవైఆర్ కృష్ణారావు. ఆవిష్కరణలో పాల్గొంటున్న ప్రముఖులు ఉండవిల్లి అరుణ్ కుమార్, మాణిక్యాల రావు, పి.మధు, రామకృష్ణ.. అందరూ కలిపి పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావుకు అంకితం ఇస్తున్నారు.

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అసలే కేంద్రం నుంచి సహకారం అందకపోతుండగా.. సొంత బలాలను, ప్రజా బలాన్ని నెమ్మదిగా సమీకరించుకుంటూ.. అడుగులు వేస్తున్న చంద్రబాబునాయుడును.. కాళ్లు పట్టి వెనక్కు లాగి పడదోసే ప్రయత్నం లాగా.. ఈ కుహనా మేధావులంతా.. ఈ పుస్తకం ప్రయత్నాన్ని చేస్తున్నట్లుగా ఉంది. రాజధాని ఎంపిక దుర్మార్గం అని వారు నమ్మితే.. ఆనాడే వ్యతిరేకించి ఉండాలి. పవన్ కల్యాణ్ గానీ, ఐవైఆర్ గానీ, ఉండవిల్లి గానీ అప్పుడేం చేస్తున్నారు? తీరా ఇప్పుడు ప్రజలు స్పందించి.. రాజధానికి తోడ్పాటు అందించాల్సిన సమయంలో.. వారి ఆలోచనలను విషపూరితం చేసేలాగా.. రాజధాని నిర్మాణ ప్రయత్నం అనేది ప్రభుత్వం అనుకున్న రీతిలో ముందుకు సాగకుండాపోయేలాగా.. కుట్ర పూరితంగా వీరు ఈ పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రభుత్వం అవినీతికి పాల్పడితే విమర్శించడం ఒక ఎత్తు. అర్థం చేసుకోవచ్చు. కానీ నగర నిర్మాణ పనుల్లో కూడా ఈ దశలో అడ్డుపడుతున్న తీరు చూస్తే.. పవన్ ను ప్రగతి నిరోధకులు అనకుండా.. మరేం అనాలో ప్రజలకు అర్థం కావడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.