‘పందెంకోడి- 2’ మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు

బ్యాన‌ర్స్‌: లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి, విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌

న‌టీనటులు: విశాల్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, రాజ్‌కిర‌ణ్, హ‌రీష్ పేర‌డే, గంజా క‌రుప్పు త‌దిత‌రులు

ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌

కెమెరా: కె.ఎ.శ‌క్తివేల్‌

సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా

నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా

దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి

పందెంకోడి సినిమాతో తెలుగువాళ్లకు హీరోగా పరిచయం అయిన విశాల్.. అప్పటి నుంచి అతడి ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నాడు. ఒకప్పుడు కేవలం యాక్షన్ సినిమాలకే ప్రధాన్యమిచ్చిన అతడు.. ఇప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుని సక్సెస్ అవుతున్నాడు. ‘డిటెక్టివ్’, ‘అభిమన్యుడు’ వంటి వరుస విజయాల తర్వాత అతడు చేసిన సినిమానే ‘పందెంకోడి-2’. విశాల్ కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ‘పందెం కోడి’ మూవీ. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘పందెం కోడి 2’ విజయదశమి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. విశాల్‌, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాల్ మాజీ ప్రేయసి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయిక పాత్రలో కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా మొదటి భాగంగా సక్సెస్ అయిందా..? విశాల్ హ్యాట్రిక్ సాధించాడా..?

కథ
ఏడు ఊళ్లకు పెద్ద రాజా రెడ్డి (రాజ్ కిరణ్). ఫారన్‌లో చదువుతున్న ఆయన కుమారుడు బాలు (విశాల్) జాతర కోసం ఊరికి వస్తాడు. అయితే ఏడేళ్ల క్రితం.. ప్రతి ఏటా ఆ ఏడు ఊర్లు కలిసి జరుపుకున్నే వీరభద్ర జాతరలో భోజనాల దగ్గర జరిగిన ఓ చిన్నపాటి గొడవలో ఓ రెండు కుటుంబాల మధ్య పగ పెరుగుతుంది. దాంతో ఆ రెండు కుంటుంబాల్లోని ఒక కుటుంబం అయిన భవాని (వరలక్ష్మి శరత్ కుమార్) మనుషులు, ఆవతలి కుటుంబంలోని మనుషులందర్నీ చంపేస్తారు. ఇక చంపాల్సిన వ్యక్తి ఒక్కడు ఉంటాడు. ఆ వ్యక్తికి అండగా రాజా రెడ్డి నిలబడతాడు. ఉన్న ఆ ఒక్క శత్రువుని కూడా చంపాలని భవానీ మనుషులు ప్రతి నిముషం కాచుకొని ఉంటారు. ఈ క్రమంలో రాజా రెడ్డి అతన్ని కాపాడటానికి ఏం చేశాడు..? రాజా రెడ్డి కొరకు మేరకు.. ఆ వ్యక్తిని బాలు(విశాల్) ఎలా కాపాడాడు ? మళ్లీ ఆ కుటుంబాల మధ్యన ఎలాంటి గొడవలు రాకుండా బాలు ఏమి చేశాడు ? పగతో రగిలిపోయే భవానీ చివరకు పగని వదిలేసి మాములు మనిషిగా మారుతుందా ? బాలు తన తండ్రి కోరికను నేరవేరుస్తాడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే..!

సినిమా ఎలా ఉందంటే
అప్పట్లో వచ్చిన పందెంకోడితో పోల్చుకుంటే ఈ సినిమా బాగా నిరుత్సాహపరుస్తుంది. విశాల్, కీర్తి సురేష్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పందెంకోడి 2’ చిత్రంలో కొన్ని మెప్పించే అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, తెలుగు నేటివిటీకి సినిమా కొంచెం దూరంగా అనిపించడం.. సినిమాలో మెయిన్ థీమ్ కు తగట్లు ట్రీట్మెంట్ లేకపోవడం వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి. అయితే, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు విశాల్ కి అతని తండ్రికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ‘ఏ’ సెంటర్ ప్రేక్షకుల్ని పూర్తిగా మెప్పించలేకపోవచ్చు. కానీ, బీ. సీ సెంటర్ ప్రేక్షకులను.. ముఖ్యంగా పల్లెటూరి ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

నటీనటుల పనితీరు
ఇప్పటికే చాలా చిత్రాల్లో మాస్ నటుడిగా మెప్పించిన విశాల్ ఈ సినిమాలోనూ దానినే కొనసాగించాడు. రాయలసీమ బ్యాగ్ర్డాప్ ఉన్న పాత్రకు తగ్గట్లు తన లుక్‌ను తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో, చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్‌గా నిలచారు. అల్లరి అమ్మాయి అయిన చారుమతి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తీ సురేష్ తన గ్లామర్‌తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్‌తో.. అచ్చం ఓ పల్లెటూరి అమ్మాయిగా, ఎవరికీ భయపడని చలాకీ అమ్మాయిలా చాలా బాగా నటించింది. హీరోకి తండ్రి పాత్రలో నటించిన రాజ్ కిరణ్ ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పగతో రగిలిపోయే ఆడదానిలా ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు లింగుస్వామి కొన్ని సన్నివేశాలను ఎమోషనల్‌గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్‌కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు. శక్తివెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్‌గా పల్లెటూరి విజువల్స్‌ను చాలా బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. కె ఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్‌ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

మొత్తంగా: ‘పందెంకోడి-2’ మాస్ ప్రేక్షకులకే

రేటింగ్: 2.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.