పాల‌మూరు నుంచి వ‌ల‌స‌లు పెరుగుతాయ‌ట‌

రాబోయే కొద్దికాలంలో పాలమూరు పసుపుదళం మొత్తం త్రివర్ణశోభితం అవ్వనుంది. రేవంత్‌రెడ్డితో మొదలైన వలసల పరంపర.. అతి కొద్దికాలంలోనే మళ్లీ ప్రారంభం కానుంది. ఇందులో అంతా డైరెక్ట్‌గా సైకిల్‌ దిగి చేయి చేయి కలపనుండగా.. ఒక్క నేత మాత్రం సైకిల్‌… ఆటో… కమలం.. చేయి అనే మెట్లదారిన కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారు. మిగతావారి గురించిన సంగతుల కంటే నాగం జనార్దన్‌రెడ్డి విషయంలో మాత్రం చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా నాగర్‌కర్నూలు నుంచి మొత్తం పాలమూరు ప్రాంతంలో అత్యంత ప్రభావితమైన నాయకుడిగా ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి గత ఆరేళ్లుగా అనేక ఎత్తుపల్లాలు చూశారు. రాష్ట్ర.. జిల్లా స్థాయిలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. పొమ్మనలేక పొగపెట్టారు. బీజేపీలో నాగం ఇమడలేకపోయారు. నాగం అనుచరగణం కూడా ఇబ్బందులు పడింది.. పార్టీ మారాల్సిందేనంటూ నాగంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అది కూడా కాంగ్రెస్‌పార్టీలోనే చేరాలనీ.. నాగర్‌కర్నూల్‌ నుంచే పోటీ చేయాలని డిమాండ్‌ కూడా పెట్టారు.. ఉగాది తర్వాత నిర్ణయం తీసుకుంటానని అనుచరులతో చెప్పిన నాగం.. చెప్పినట్టుగానే పండుగ తర్వాత బీజేపీకి రాజీనామా చేశారు.
తదుపరి కార్యాచరణను చెబుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్‌ వారిని కలవరపెడుతోంది. ఇంతకాలం పార్టీలో అన్నీ తామై నడిపించిన నాయకత్వం కొత్తవారి రాకతో ఇరుకునపడుతుందున్న సందేహం కాంగ్రెస్‌ నేతలను అప్రమత్తం చేసింది. జిల్లాలో ఇప్పటికే రేవంత్‌ తన దూకుడు పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తూ.. డీకే అరుణను కొంత ప్రాంతానికే పరిమితం చేశారన్న భావన కాంగ్రెస్‌ నేతల్లో ఉంది. ఇక నాగం కూడా పార్టీలోకి వస్తే అరుణ ఆధిపత్యానికి గండిపడుతుందని అభిప్రాయపడుతున్నారు. నాగం.. జైపాల్‌రెడ్డి.. రేవంత్‌… చిన్నారెడ్డిలు కలిసి అరుణను కేవలం రెండు మూడు నియోజకవర్గాలకే పరిమితం చేస్తారని అనుకుంటున్నారు. అందుకే నాగం రాకను తీవ్రస్థాయిలో అడ్డుకుంటున్నారు. నాగం జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రెస్‌మీట్‌ పెట్టి  అలా బీజేపీకి రాజీనామా చేశారో లేదో.. అక్కడి నుంచి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు.. గత ఎన్నికల వరకు నాగం చేతిలో అయిదుసార్లు ఓటమి చెందిన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తీవ్రంగా అభ్యంతరం చెబుతూ మీడియాకు ఎక్కారు. నాగం వస్తే కాంగ్రెస్‌ పూర్తిగా నాశనమవుతుందని.. ఇంతకాలం కాంగ్రెస్‌ను ఓడించిన నాగంను పార్టీలోకి తీసుకోవద్దని డిమాండ్‌ చేశారు. ఒకవేళ నాగం కనుక కాంగ్రెస్‌లోకి వస్తే తమ సహకారం ఉండదని కూడా హెచ్చరించారు. అసలు కాంగ్రెస్‌లో నాగం ఎలా నెగ్గుకువస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
అయితే నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు పెద్ద రాజకీయమే కొనసాగుతుందట! పాలమూరు ప్రాంతంలో మంచి ఇమేజ్‌ ఉన్న నాయకురాలిగా ఎదిగిన డీకే ఆరుణ.. ఇప్పటి వరకు పద్నాలుగు నియోజకవర్గాలలో పదింటివరకు ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు. ఆ ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలని సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి గత కొద్దికాలంగా పావులు కదుపుతున్నారు. అలాంటి నేతకు నాగం లాంటి చతురుడు తోడైతే.. చిన్నారెడ్డి.. మల్లు రవి లాంటి నేతలు సహకరిస్తే అరుణ ఆధిపత్యాన్ని నిలువరించవచ్చన్నది జైపాల్‌ వర్గీయుల ఆలోచనట! నాగం రాకను కాంగ్రెస్‌లోని ఓ వర్గం స్వాగతిస్తుంటే.. మరోవర్గం వ్యతిరేకిస్తోంది.. ఇదిలా ఉంచితే.. కాంగ్రెస్‌లో వలసలు అగేట్టుగా లేవు.. తెలుగుదేశంపార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహపడుతున్నారట! ఇప్పటివరకు రేవంత్‌ను విభేదిస్తున్న నాయకులు కూడా కాంగ్రెస్‌కు క్యూ కడుతున్నారట! రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరిన సమయంలో అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరిపడిన దయాకర్‌రెడ్డి ఇప్పుడు పూర్తిగా మెత్తబడ్డారు. తనకు మాత్రం టీడీపీలోనే ఉండాలని ఉందని.. ఒకవేళ కార్యకర్తలు కోరితే డీకే అరుణ వర్గీయుడిగా కాంగ్రెస్‌లోకి వెళతానే తప్ప జైపాల్‌రెడ్డి వర్గీయుడిగా కాదని సెలవిచ్చారు. సీతా దయాకర్‌రెడ్డి ఎలాగూ భర్త అడుగుజాడల్లోనే నడుస్తారు. ఇక వీరితో పాటు ప్రస్తుత టీడీపీ పాలమూరు జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్‌.. మహబూబ్‌నగర్‌ ఇన్‌ఛార్జ్‌ ఎన్‌.పి.వెంకటేశ్‌లు కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే చంద్రబాబుకు సన్నిహితులు.. సిన్సియర్‌ నేతగా పేరున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాత్రం ఎలాంటి లీకులు ఇవ్వలేదు. వనపర్తిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చిన్నారెడ్డి.. రేవంత్‌రెడ్డి ఇద్దరూ బహిరంగంగానే రావులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి పార్టీలోకి వస్తే ఆయన కోసం వనపర్తి టికెట్‌ను కూడా వదులుకునేందుకు సిద్ధమని చిన్నారెడ్డి ప్రకటించారు. ఈ విషయంపై రావుల మాత్రం స్పందించలేదు. తనకు టీడీపీ అన్నీ ఇచ్చిందనీ.. రాజకీయాలలో ఏదో ఒక పార్టీలోనే ఉండాలన్న నియమం తనదని… పార్టీని ఎట్టి పరిస్థితులలో వీడనని రావుల చెబుతున్నా… కాంగ్రెస్‌ నేతలు మాత్రం వదలడం లేదు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సరిగ్గా పదేళ్ల కిందట పాలమూరులో పసుపు జెండాను రెపరెపలాడించిన నేతలంతా కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా… పాలమూరులో మాత్రం టీడీపీ జోరు సాగింది.. 14 స్థానాల్లో తొమ్మిదింటిలో టీడీపీ విజయం సాధించింది.. అప్పుడు గెలిచిన వారిలో చాలామంది ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారు. ఏదిఏమైనా పాలమూరు ప్రాంతం తన ప్రత్యేకతను మరోసారి చాటుకోనుంది.. తెలంగాణలోని అన్ని జిల్లాలలో వలసలు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జరుగుతుండగా.. పాలమూరులో మాత్రం టీడీపీ టు కాంగ్రెస్‌ దిశగా సాగుతుండటం విశేషం.. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.