‘పడి పడి లేచె మనసు’ మూవీ రివ్యూ

బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
న‌టీన‌టులు: శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియ రామన్, అభిషేక్ మ‌హ‌ర్షి త‌దిత‌రులు
కెమెరా : జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: శ‌్రీక‌ర్ ప్రసాద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
దర్శకుడు: హను రాఘవపూడి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి

గత సినిమాలతో యూత్ ఆడియన్స్ బాగా దగ్గరయ్యారు శర్వానంద్, సాయి పల్లవి. క‌థా బ‌ల‌మున్న పాత్ర‌ల‌ను అవ‌లీల‌గా చేయగల సత్తా ఉన్నోడు శర్వానంద్ అయితే.. ముద్దు ముద్దు మాటలతో, చ‌లాకీత‌నంతో మెప్పించ‌గ‌ల‌ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ కాంబినేషన్ తో హను రాఘవపూడి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసిన సినిమా ‘పడి పడి లేచె మనసు’. ఈ రోజే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దామా..

కథ:

కోల్ కతాలో చదువు పూర్తి చేసి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తున్న వ్యక్తి సూర్య రావిపాటి (శర్వానంద్). ఇతను ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌ కూడా. అనుకోకుండా సూర్య.. డాక్ట‌ర్ అయిన వైశాలి (సాయిపల్లవి)ని చూసి ప్రేమలో మునిగిపోతాడు. ఆమె వెంట పడి పడి.. చివరికి ఆమెను కూడా ప్రేమలోకి దించేస్తాడు. రెండేళ్ల త‌ర్వాత వైశాలికి సూర్య అంటే ఇష్టం పెరుగుతుంది. ఒక‌రిని ఒక‌రు గాఢంగా ప్రేమించుకుంటారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల జీవితంలో జరిగిన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని అతను వైశాలితో పెళ్లికి నిరాకరిస్తాడు. ఒకరినొకరు విడిచి ఉండిపోలేనంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఆ క్రమంలో సూర్య, వైశాలి ఒక ఏడాది పాటు ఒకరికొకరు దూరంగా ఉండాలనే ఒప్పందానికి వస్తారు. మరి ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది? తిరిగి వీళ్లిద్దరూ ఏడాది తర్వాత కలిశారా? లేదా? ఈ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలను వెండితెరపై చూడాల్సిందే..

సినిమా ఎలా ఉందంటే:
ఓ అమ్మాయి వెనుక రెండేళ్లు తిరిగి ఆమె ప్రేమ పొందటం మామూలు విషయం కాదు. ఆ విష‌యాన్ని చెప్పే ప్రయత్నమే చేశాడు ద‌ర్శ‌కుడు హను రాఘవపూడి. ప్రేమ‌లో అర‌మ‌రిక‌లు ఉండ‌వు. ప్రేమించిన వారి మ‌ధ్య అబ‌ద్ధాలుండ‌వు అనే విష‌యాన్ని కూడా అంత‌ర్లీనంగా ఇందులో పొందుపరిచారు. చిత్రంలోని అన్ని సీన్లు ప్ర‌త్యేకంగా అనిపిస్తాయే త‌ప్ప‌.. క‌థ‌లో ఎక్క‌డా క‌లిసిన‌ట్టు క‌నిపించ‌దు. హీరోయిన్ తండ్రి అంతు చూడాల‌నుకున్న రౌడీ ముఠా ఒకటుంది అన్నట్లు బిల్డ‌ప్ ఇచ్చారు. కానీ వాళ్లెవ‌రో చివ‌రికి క‌నిపించ‌రు. సినిమాలో ఒక్కొక్క‌రికి ఒక్కో మేన‌రిజ‌మ్ ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా అవ‌న్నీ పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు. టైటిల్ సాంగ్ మిన‌హా మిగిలిన‌వి క‌థ‌లో భాగంగా సాగిపోతుంటాయే తప్పితే పెద్ద‌గా క‌నెక్ట్ కావు. ఒక వైపు వెన్నెల‌కిశోర్‌, సునీల్‌, ప్రియ‌ద‌ర్శి ఇలా ఇంత మంది క‌మెడియ‌న్లున్నా, ఎక్క‌డా నవ్వు తెప్పించారు. సునీల్ పాత్ర కూడా అంత స్పెష‌ల్‌గా ఏమీ అనిపించ‌దు. సాయిప‌ల్ల‌వికి డ్యాన్సులు తెలుసు అనే విష‌యాన్ని ఎలివేట్ చేయ‌డానికే ఆమె ట్రాఫిక్‌లో బ‌స్సు మీద నృత్యం చేసే షాట్‌, డాబా మీద నృత్యం చేసే షాట్ పెట్టారేమోన‌ని అనిపిస్తుంది. ప్రేమించిన‌వాడి మ‌న‌సులో శాశ్వ‌తంగా ఉండిపోవాల‌ని కోరుకున్న డాక్ట‌ర్ ప‌డే తాప‌త్ర‌యాన్ని చూపించాల‌నుకున్న ద‌ర్శ‌కుడు.. ప్రేమించిన హృదయం పడే భావోద్వేగాల‌ను ఇంకాస్త బలంగా చూపించాల్సింది.

నటీనటుల పనితీరు:
శర్వానంద్-సాయిపల్లవిల పెర్ఫామెన్స్.. వాళ్ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయాయి. ఇద్దరూ పోటీ పడి నటించారు. సినిమా చివరికి ఎలాంటి ఫీలింగ్ కలిగించినా.. వీరి పెర్ఫామెన్స్ కోసం మాత్రం ఒకసారి చూడొచ్చనిపిస్తుంది. ఇంటర్వెల్ మలుపు దగ్గర సాయిపల్లవి హావభావాలు కట్టి పడేస్తాయి. శర్వా కొన్ని సీన్లలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాకపోతే మిగతా నటీనటులెవరినీ కూడా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేక పోయాడు.

టెక్నీషియన్ల పనితీరు:
‘పడి పడి లేచె మనసు’ లో టెక్నీకాల్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. ప్రేమకథకు సరిగ్గా సరిపోయే విధంగా విశాల్ చంద్రశేఖర్ బాణీలు కట్టారు. నేపథ్య సంగీతంలోనూ మంచి ఫీల్ ఉంది. జేకే ఛాయాగ్రహణం కూడా సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. ఈ విషయంలో నిర్మాత సుధాకర్ చెరుకూరిని అభినందించాల్సిందే. మొత్తంగా చూస్తే.. ఈ అందరినీ దర్శకుడు హను రాఘవపూడి పూర్తి మొత్తంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు.

బలాలు
* శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి జంట
* సుందరమైన లొకేషన్స్
* కొన్ని డైలాగులు
* సంగీతం

బలహీనతలు
* కొత్తదనం లేకపోవటం
* సెకెండాఫ్ బోరింగ్‌గా అనిపించడం
* కామెడీ

మొత్తంగా: ‘పడి పడి.. లేవకుండా అలాగే పడిపోయిన సినిమా’

రేటింగ్: 2.25 /5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.