బంద్ కోసం కసరత్తు.. వద్దంటున్న చంద్రబాబు

హోదా పోరు పతాక స్థాయికి చేరింది. మండుటెండలో హోదా వాడి సెగ రేపుతోంది. బీజేపీకి తగిలేలా మరింతగా వేడి రగిలించాలని హోదా సాధన సమితి నిర్ణయించింది. ఫలితంగా పోరాటాలు ఉదృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్యంగా ముందుకు కదులుతున్నాయి. పార్టీలన్నీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. హోదా సాధన కోసం ఈ నెల 16న ఏపీ బంద్‌కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేనలు మద్దతు తెలిపాయి. టీడీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్‌ కు దిగుతున్నట్లు సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ ప్రకటించారు. ఇప్పటి వరకు బంద్ లు చేస్తే ఇబ్బందులు పెట్టిన టీడీపీ ఇప్పుడు రూటు మార్చకపోతే తిప్పలు తప్పవు. యూటర్న్ అంకుల్ చంద్రబాబు బంద్ కు మద్దతు తెలపాలని వైకాపా ఎద్దేవా చేస్తోంది. 
ప్రధానమంత్రి మోడీ పార్లమెంటు సమావేశాలు జరగనందుకు నిరసనగా దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల కోసం రోడ్డెక్కుతున్నట్టు వివిధ పక్షాలు ప్రకటించాయి. బంద్‌ నాడు అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్టు తెలిపారు. బంద్‌ను ఎవ్వరూ అడ్డుకోవద్దని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఏపీ బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. ప్రజల ఆగ్రహానికి భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి పార్థసారధి లాంటి వారు ఆరోపించారు. హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. టీడీపీ దుష్ట చర్యలను బంద్ ద్వారా ప్రజలకు తెలియచేస్తామని వారు చెబుతున్నారు.
వైకాపా ఒత్తిడి మేరకు చలసాని శ్రీనివాస్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించగా.. చంద్రబాబు నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో చలసాని తన వాదన గట్టిగానే వినిపించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఎవరి మాట విని బంద్ కు పిలుపునిచ్చారనే సంగతి వదిలి పెడితే.. చలసాని ఇందుకు కేంద్ర బిందువుగా మారడం విశేషమే. కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా బంద్‌కు అన్ని పార్టీలతో పాటు సీపీఎం కూడా సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు ప్రకటించారు. భారతీయ జనతాపార్టీపై యుద్ధం చేస్తామని, దొంగ దీక్షలతో నరేంద్ర మోదీ అబద్ధాలకోరుగా మారిపోయారని వారు విమర్శించారు. ప్రజా‌పోరాటంతోనే కేంద్రంపై పోరాడి హోదా సాధించుకుంటామన్నారు సిపిఐ నేతలు. మోదీకి ప్రధాని పదవిలో కొనసాగే అర్హత‌లేదని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. 
బంద్ లు వద్దన్న చంద్రబాబు
ఏపీలో హోదా ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కానీ సిఎం చంద్రబాబునాయుడు మాత్రం ఆ పోరాటాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు. అసలు బంద్‌లు, రాస్తారోకోలు చేస్తే రాష్ట్రానికే నష్టం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం అయిన చంద్రబాబు రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని చెప్పారు. ప్రధాని మోదీ చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు నష్టపోతారన్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు రాజీపడేది లేదన్నారు. దేశం మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. 
మోడీ పై పోరాటం చేయాలన్న బాబు
ఏపీకి అన్యాయం చేసింది, చేస్తోంది ప్రధాని మోడీ. ఆయనపై పోరాటం చేయాలని, ఢిల్లీ వెళ్లి మోడీపై పోరాటం చేయాలి కానీ… రాష్ట్రంలో రాస్తారోకోలు చేస్తే ఏం వస్తుందని చంద్రబాబు అన్నారు. బంద్‌లు రాస్తారోకోల వల్ల రాష్ట్రానికే నష్టం అని, మన పోరాటాలు ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. మొత్తంగా చంద్రబాబు బంద్ లు వద్దనడం, మోడీపై పోరాటం చేయాలని పిలుపునివ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.