బీజేపీ పై వ్య‌తిరేక‌త మొద‌లైందా…

దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో బీజేపీ, మిత్ర‌ప‌క్షాలే అధికారంలో ఉండేలా ప్ర‌ధాని మోదీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనికి అమిత్‌షా త‌న‌వంతు స‌హ‌కారాన్ని అంద‌చేస్తున్నారు. అయితే గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో క‌న్ను లొట్ట‌బోయి అధికార పీఠం ఎక్కిన బీజేపీ పై మిగ‌తా రాష్ట్రాలు విరుచుకుప‌డుతున్నాయి. బ‌డ్జెట్‌లో త‌మ‌కు స‌ముచిత స్థానం ఇవ్వ‌లేద‌ని తెలుగు రాష్ట్రాల‌తో పాటు అనేక రాష్ట్రాలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. బ‌డ్జెట్ చ‌ప్ప‌గా ఉందంటూ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే ఇంకోప‌క్క మోడీ వ్య‌తిరేక ప‌వ‌నాల తీవ్ర‌త రాజ‌స్థాన్ లో స్ప‌ష్టంగా క‌నిపించింది. రాజ‌స్థాన్ లో రెండు లోక్ స‌భ, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ రాష్ట్రంలో భాజ‌పా అధికారంలో ఉంది. కేంద్రంలో ఉన్న‌ది భాజ‌పా స‌ర్కారే. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో సాధార‌ణంగా అధికార పార్టీకే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌. ప్ర‌తిప‌క్ష పార్టీ ప్రాతినిధ్యం వ‌హించిన స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా అధికార పార్టీల‌దే పైచేయి అవుతూ వ‌చ్చిన సంద‌ర్భాలే ఎక్కువ‌. అయితే, అనూహ్యంగా రాజస్థాన్ లో జ‌రిగిన ఈ ఉప ఎన్నిక‌ల్లో భాజ‌పా ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. కాంగ్రెస్ చేతిలో చిత్తుచిత్తుగా భాజ‌పా ఓడిపోయింది. ల‌క్ష‌కు పైగా మెజారిటీతో పార్ల‌మెంటు స్థానాలు, ప‌దివేల‌కు పైగా మెజారిటీతో అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ ద‌క్కించుకుంది.
అజ్మీర్‌, అల్వార్ పార్ల‌మెంటు, మండ‌ల్ ఘ‌ర్ అసెంబ్లీ సీట్లలో ఉన్న ప్ర‌తినిధులు చనిపోయాక ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అల్వార్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థికి దాదాపు 2 ల‌క్ష‌ల‌ మెజారిటీ రాగా అజ్మీర్ లో కాంగ్రెస్ ది 84 వేల ఓట్లు, అసెంబ్లీ స్థానంలో 12 వేల మెజారిటీ దక్కాయి. ఈ ఫ‌లితాల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ‘వెల్ డ‌న్ రాజ‌స్థాన్ కాంగ్రెస్‌. ప్ర‌జ‌లు భాజ‌పాను ఎంత‌గా వ్య‌తిరేకిస్తున్నారన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం’ అంటూ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ ట్వీట్ చేసారు. రాజస్థాన్ లో కూడా వ‌సుంధ‌రా రాజే ఈ స్థానాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు.
ఫ‌లితాలపై వెంట‌నే నివేదిక తెప్పించుకుంటామ‌ని, విశ్లేషించుకుంటామ‌ని ఢిల్లీ భాజపా పెద్ద‌లు అంటున్నారు. మిత్ర‌ప‌క్షాల‌ను దూరం చేసుకుంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీలు త‌మ‌పై ఆధార‌ప‌డాల‌నే వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డం కోసం మోడీ, అమిత్ షా ద్వ‌యం వ్యూహర‌చ‌న‌లో మునిగి తేలుతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైపోతున్నారు, జ‌మిలి ఎన్నిక‌ల‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏదేమైనా ఉత్తరాదిలో మోడీ వ్య‌తిరేకత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్ప‌డానికి ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ‌.ద‌క్షిణాదిలో ప‌ట్టుకోసం ఓ వైపు ప్ర‌య‌త్నిస్తుంటే ఉత్త‌రాదితో వ్య‌తిరేక ప‌వ‌నాలు బీజేపీ సీనియ‌ర్‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. మోదీ ప్లానింగ్‌ను స‌మీక్షించుకోవాల‌ని సీనియ‌ర్‌లు  స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. మ‌రి మోదీ ఎలా స్పందిస్తారో చూద్దాం.
 

1 Comment

  1. రాజస్థాన్ ప్రజలు బి.జె.పి ని వ్యతిరేకించి ఓటు వేసి ఉండొచ్ఛు, అంతమాత్రానికి కాంగ్రెస్ సంబరపడిపోనక్కరలేదు. ప్రజాహితంగా వ్యవహరించకపోతే కాంగ్రెసుకు కూడా అదే గతిపడుతుందని అర్ధం చేసుకుని, ఆదర్శవంతంగా పరిపాలిస్తే, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ప్రజల్లాగా ఎల్ల కాలం పరిపాలించవచ్ఛు.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.