అందుకే వైపీసీ బహిరంగ సభలు ప్రస్తుతానికి లేవట?

టీఎస్‌లో రాజకీయాలు ముందస్తు దిశగా సాగుతుండగా, ఏపీ రాజకీయాలు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ… ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఆ పార్టీని టార్గెట్ చేస్తోంది. అలాగే బీజేపీ, వైసీపీ కలిసిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీని లక్ష్యంగా చేసుకుని మండిపడుతున్నారు. అయితే పార్టీపరంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే విషయంలో వైసీపీ నేతలు వెనుకబడివున్నారని తెలుస్తోంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉండటంతో జిల్లాల్లో వైసీపీ నేతలు అడపాదడపా జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలు మరో రకమైన వాదన కూడా ఉందంటున్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే ఆ పార్టీలో ఆకర్షణ ఉన్న నేతల సంఖ్య తక్కువగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని భావిస్తున్న నాయకులు పాదయాత్రలో ఉన్న జగన్ తమ సమావేశాలకు రారనే ఉద్దేశంతో ఉన్నారట. ఈ కారణంగానే చాలామంది నాయకులు జిల్లా స్థాయిలో భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. మరోవైపు వైసీపీ పెద్దలు సైతం జగన్ లేకుండా ఎలాంటి భారీ సమావేశాలు నిర్వహించకూడదని జిల్లా స్థాయి నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.
దీంతో నియోజకవర్గ స్థాయి నాయకులు తమ ప్రాంతాల్లో పార్టీ తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా తమ ప్రాంతాల్లో భారీ సభలు ఏర్పాటు చేయాలనుకుంటున్న నేతలు తమ ప్రతిపాదనను వాయిదా వేసుకుంటున్నారని సమాచారం. వైసీపీలో జగన్ తరహాలో మరో జనాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల హడావిడి మొదలైన తరువాత సభలు ఏర్పాటు చేసే ఆలోచనలో మరికొందరు నేతలు ఉన్నారని భోగట్టా. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తయిన అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మరోసారి భారీ బహిరంగ సభలు ఉంటాయని నాయకులు అడిగినవారికల్లా చెబుతున్నారట. ఎలాగూ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే సభల్లో జగన్ పాల్గొంటారు కాబట్టి అప్పుడు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంలో చాలామంది నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు తమకు ఎన్నికల్లో టికెట్ ఖరారు కాకముందే పార్టీ కోసం భారీ ఎత్తున ఖర్చు చేయడం ఎందుకనే ఉద్దేశంలోనూ చాలామంది నాయకులు ఉన్నారనే చర్చ నడుస్తోంది. అయితే పేరున్న కొందరు నేతలు మాత్రం విజయసాయిరెడ్డి, రోజా వంటి నాయకులను తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఏతావాతా చూస్తే జగన్ పాదయాత్ర పూర్తయిన తరువాతే ఏపీలో వైసీపీ తరపున బహిరంగ సభలు ఉంటాయని భోగట్టా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.