ఒంగోలు వైసీపీ రాజ‌కీయాల్లో చల్లని కబురు

వైసీపీ పార్టీలో వారిద్దరూ సీనియ‌ర్ నాయ‌కులు. గ‌తంలో వైఎస్‌తో, ఇప్పుడు జ‌గ‌న్ తోనూ స‌న్నిహిత సంబంధాలున్న నేత‌లు. అంతకుమించి స‌మీప బంధువులు.  అయినా వారి మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డంతో వైసీపీ కి తలనొప్పులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒంగోలు రాజ‌కీయాల్లో కలకలం చెలరేగింది. అటువంటి నేతలు ఇప్పుడు హ‌ఠాత్తుగా ఒక్క‌ట‌య్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వారు చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారని తెలుస్తోంది. అలాగే క‌లిసి కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నారట. వారే వైవీ సుబ్బారెడ్డి, ఆయన బావ బాలినేని శ్రీనివాస‌రెడ్డి. వీని తాజా రాజకీయ అనుబంధం ఆస‌క్తిగా మారుతున్నదని తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి, బాలినేని క‌లిసి సాగితే వైసీపీకి ఎదురుండ‌దని స్థానికంగా ప్రచారం సాగుతుంటుంది. అయితే అనూహ్యంగా 2014లో ఒంగోలు ఎమ్మెల్యే సీటుకి పోటీప‌డిన బాలినేని శ్రీనివాస‌రెడ్డి ప‌రాజ‌యం పాల‌య్యారు. దానికి కార‌ణం వైవీ సుబ్బారెడ్డేని బాలినేని అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారట. త‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోగా కీల‌క విష‌యాల్లో త‌న‌ను అడ్డు తొల‌గించుకునే రీతిలో సుబ్బారెడ్డి వ్య‌వ‌హ‌రించారన్న‌ది అప్పట్లో బాలినేని వాదనగా నిలిచింది.
దాంతో నాటి నుంచి ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఒకరికొకరు దూర‌మ‌య్యారు. ఎదురుపడినా పలుకరించుకోలేనంత గ్యాప్ వారి మ‌ధ్య పెరిగిన‌ట్టు వార్తలు వచ్చాయి. దాంతో ప్ర‌కాశం జిల్లాలో పార్టీ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాలంటే ఈ ఇద్ద‌రినీ స‌మ‌న్వ‌య ప‌ర‌చాల‌న్న నిర్ణ‌యానికి వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వారితో చ‌ర్చ‌లు జ‌రిపి, విబేధాలు వీడి, క‌లిసి సాగాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తోంది. దాంతో ప‌రిస్థితి క్ర‌మంగా మారుతున్న‌ట్టు సమాచారం. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుబ్బారెడ్డి పోటీ చేసే అవ‌కాశం లేద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో బాలినేని కొంత సంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. త‌న ఎంపీ సీటు త్యాగం చేసి పార్టీ కోసం సాగ‌డానికి వైవీ సుబ్బారెడ్డి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు బాలినేని కూడా అదే రీతిలో వ్య‌వ‌హ‌రించాలంటూ జ‌గ‌న్ చెప్ప‌డంతో ఈ ఇద్ద‌రు నేత‌లు ఐక్యంగా సాగేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌నే వాదన వినిపిస్తోంది. ఇదే కొన‌సాగితే కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలోని స‌మ‌స్య‌లు సద్దుమణుగుతాయని స్థానిక పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.